సిరిసిల్ల టౌన్, జూన్ 22: కేటీఆర్ అంటేనే కేరాఫ్ సిరిసిల్ల అని, అభివృద్ధిలో జిల్లాను రాష్ర్టానికే దిక్సూచిగా నిలిపారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ గొప్పనాయకుడిని విమర్శించిన కాంగ్రెస్ నాయకుడు కేకేను ప్రజలు విశ్వసించబోరన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి మంత్రి కేటీఆర్ అఖండ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అదే ఎన్నికల్లో మహేందర్‌రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పదని జోస్యం చెప్పారు. జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది ఉత్సవాలను ప్రజలందరూ పండగ వాతావరణంలో జరుపుకున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ సంతోషంగా స్వాగతిస్తుంటే, కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి ఓర్వలేక మంత్రి కేటీఆర్‌పై అవాకులు చేవాకులు పేలుడుతున్నాడని విమర్శించారు. కేకే అంటేనే అరిగిపోయిన రికార్డుగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు విమర్శలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, గ్రామాల్లో పర్యటిస్తూ కల్లబొల్లి మాటలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో రాష్ట్రానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కాళేశ్వరం జలాలతో మిడ్‌మానేరు, మల్కపేట రిజర్వాయిర్, సింగసముద్రాన్ని సస్యశామలం చేయబోతున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నూతన సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలల్లో అద్భుతమైన ప్రగతిని సాధించామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనాలను నిర్మించి ఆయా సామాజిక వర్గాలకు అందిస్తున్నమన్నారు. మహిళల కోసం ప్రత్యేక కమ్యూనిటీ భవనాలను నిర్మించామన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, గుండం నర్సయ్య, అందె శుభాష్, కొమిరిశెట్టి లక్ష్మణ్, కమ్మరి రాజారాం, కుంభాల మల్లారెడ్డి, జక్కుల నాగరాజు, అంకారాపు రవీందర్, మాట్లా మాధు, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.