ఎల్లారెడ్డిపేట, మార్చి 15: మూడు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ స్టాచ్యూకు ఆటో ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్రగాయాల పాలై హస్పిటల్లో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేణి రాజు(39) ప్రతి రోజు పలు గ్రామాల్లో సేకరించిన పాలను తీసుకుని మండల కేంద్రంలోని కరీంనగర్ డైరీకి తీసుకొస్తూ ఉంటాడు. సోమవారం ఎప్పటి లాగే పాల క్యాన్లను తీసుకుని పదిర నుంచి ఎల్లారెడ్డిపేట వైపు వస్తున్నాడు.
ఈ క్రమంలో మండల కేంద్రంలోని కప్పు సాసర్ స్టాచ్యూ అంచుపైకి ఆటో టైర్ ఎక్కింది. దీంతో ఆటో బోల్తాపడగా అందులోంచి రాజు రోడ్డు మీద ఎగిరి పడ్డాడు. తలకు తీవ్రగాయాలవ్వడంతో స్థానికులు బాధితున్ని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ రాజు బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్య లక్ష్మి ఉన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. అలాగే మండల కేంద్రంలోని రోడ్డు మధ్యలో ఉన్న కప్పు సాసర్, మదర్స్లవ్ విగ్రహాల కారణంగా రోడ్డు ఇరుకుగా మారి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించాలనే డిమాండ్ పెరుగుతున్నది.