రాష్ట్రంలోనే మొదటగా ఏర్పాటు
లక్ష్మీపూర్ రోడ్డులోని ట్రైబల్ గురుకుల డిగ్రీ కాలేజీలో త్వరలోనే తరగతులు
ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటో డిజిటల్ ఇమేజింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సుల్లో 120 సీట్లు
వెల్లువలా దరఖాస్తులు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కార్మిక క్షేత్రం సిరిసిల్ల సిగలో మరో విద్యా మణిహారం చేరనున్నది. ప్రతిష్టాత్మకమైన ఫైన్ ఆర్ట్స్ ఉమెన్స్ కళాశాల రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడే ఏర్పాటు కాబోతున్నది. అమాత్యుడు కేటీఆర్ చొరవతో పట్టణ పరిధిలోని లక్ష్మీపూర్ రోడ్డులో గల ట్రైబల్ గురుకుల డిగ్రీ కళాశాలలో త్వరలోనే తరగతులను ప్రారంభించే అవకాశమున్నది. ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటో డిజిటల్ ఇమేజింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సుల్లో 120 సీట్లు కేటాయించగా, దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. యువతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
యువతులకు వృత్తి విద్యాకోర్సుల్లో చేర్పించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో సిరిసిల్లలో మహిళా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కాలేజీని రాష్ట్రంలోనే తొలిసారిగా కార్మిక క్షేత్రంలో నెలకొల్పడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ రోడ్డులోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో ఈనెల నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యేడాది ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటో డిజిటల్ ఇమేజింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులోకి తేనున్నారు. ఇందులో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా విశేష స్పందన లభిస్తున్నదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 270 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా..
వస్త్ర పరిశ్రమకు కేంద్రబిందువైన సిరిసిల్ల వివిధ విద్యా సంస్థల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్, ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేశారు. టెక్స్టైల్స్ రంగానికి అనుసంధానంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను నెలకొల్పి ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తున్నారు. మధ్య మానేరు ప్రాజెక్టులో మత్స్య సంపద పెరిగిన నేపథ్యంలో మత్స్య యూనివర్సిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్మికుల బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందించే ఉద్ధేశ్యంతో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ ఉమెన్ డిగ్రీ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేస్తుండడంపై జిల్లావాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సకల హంగులతో కాలేజీ..
తంగళ్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్రోడ్డులో గల గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ ఆకాడమీ ఫర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏడుగురు అధ్యాపకులు, డైరెక్టర్, ప్రిన్సిపాల్‌ను నియమించింది. నాలుగు అంతస్థుల భవనంలో నడుస్తున్న కళాశాలలో అధునాతన సౌకర్యాలతో రెండు ల్యాబ్‌లు, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది ఫ్యాషన్ డిజైనింగ్, ఫొటో డిజిటల్ ఇమేజింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నారు. ఒక్కో కోర్సులో 40 సీట్ల చొప్పున మొత్తం 120 సీట్లను కేటాయించారు. వీటిలో ప్రవేశాల కోసం ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి 270 మంది విద్యార్థినులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెలాఖరులో తరగతులు ప్రారంభించనున్నారు. బీఏ (హానర్స్) విభాగంలో ప్రారంభిస్తున్న కళాశాలలో 40సీట్లలో గిరిజన విద్యార్థినులకు 28, బీసీలకు 5, ఎస్సీలకు 4, ఓసీలకు 1, ఎన్సీసీ 1, ఎక్స్‌సర్వీస్ మెన్ పిల్లలకు ఒక సీటు చొప్పున కేటాయించారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్లలో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ ఉమెన్స్ కళాశాల మంత్రి ఏర్పాటు చేశారు. ఇందులో చేరిన వారికి నైపుణ్యంతో కూడిన వృతి శిక్షణ ఇస్తాం. ఉపాధి అవకాశాలు బాగుంటాయి. ఈ నెలలోనే తరగతులు ప్రారంభిస్తాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. బోధనా సిబ్బందిని నియమించాం. విద్యార్థినులు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. – కే రజనీ, ప్రిన్సిపాల్