పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక సబ్సెంటర్కు కాయకల్పఅవార్డు
ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక నిధులు
సిరిసిల్ల/వేములవాడ, జూలై 6: రోగులకు నాణ్యమైన సదుపాయాలు కల్పిస్తూ, పరిశుభ్రమైన దవాఖాన ఆవరణలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం కాయకల్ప అవార్డులు ప్రకటిస్తున్నది. ఇందుకు ఎంపికైన దవాఖానలకు ప్రత్యేక ప్రోత్సాహకంతోపాటు ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందిస్తున్నది. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా కాయకల్ప అవార్డులను 1 మే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దవాఖాన పరిశుభ్రత, రోగులకు అందించే సేవ లు, వారికి కల్పించే వసతులను పరిశీలించి ఏటా అవార్డును అందిస్తున్నది. ఈ అవార్డు ఎంపికలో భాగంగా గత మార్చిలో అన్ని దవాఖానల్లో సర్వే నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన 79.5శాతం పాయింట్లతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
అవార్డులు దక్కించుకున్న పీహెచ్‌సీలు..
ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, నెరేళ్ల, గంభీరావుపేట పీహెచ్‌సీలు కాయకల్ప అవార్డును కైవసం చేసుకున్నాయి. వీటితోపాటు గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లోని సబ్సెంటర్కు సైతం అవార్డు వరించింది. అలాగే వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లాలో రెండో స్థానాన్ని నిలుపుకున్నది. చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి మండలంలోని కోదురుపాక, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యాయి. అవార్డులో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు రూ.50వేల నగదును అందజేయనున్నారు. కాయకల్ప అవార్డు ఎంపిక కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
మెరుగైన సేవలకు గుర్తింపు
ఎల్లారెడ్డిపేట, జూలై 6: సాధారణ, కొవిడ్ సేవలతో తమదైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎల్లారెడ్డిపేట ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి కాయకల్ప అవార్డు వరించిది. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, దవాఖానలో వసతులతో జిల్లాలో 80.28శాతం పాయింట్లతో అత్యుత్తమ స్థానం కైవసం చేసుకున్నది. అవార్డుతో రూ.2లక్షల ప్రైజ్‌మనీని అందుకోబోతున్నది. వీటితో దవాఖానలో మరిన్ని వసతులు కల్పించి మెరుగైన సేవలు అందించనున్నారు.
మెరుగైన వసతులు
కాయకల్ప అవార్డుతో దవాఖానలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు రోగులు నాణ్యమైన సేవలు అందింవచ్చు. అధికారులు, సిబ్బంది పనితీరు ఈ అవార్డు వచ్చింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఈ అవార్డుతో వచ్చిన రూ.50వేల ప్రోత్సాహకంతో దవాఖానలో అందరి ఆమోదంతో అభివృద్ధి పనులు చేపడుతాం.
అందరి సహకారంతోనే..
ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారంతోనే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డును సొంతం చేసుకున్నది. ఏ అవసరం ఉన్నా ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకారం అందిస్తున్నారు. రెండు మండలాల ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది.