అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
రాజుపేటలో గ్రామసభకు హాజరు
అభివృద్ధికి హామీలు.. బాధితులకు భరోసా
నాలుగు గ్రామాల్లో కలియదిరిగిన అమాత్యుడు
సిరిసిల్ల/ గంభీరావుపేట, జూలై 1 :ఓవైపు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ.. మరోవైపు హామీలిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. రాజుపేట, జగదాంబతండాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. రాజుపేటలో పల్లె ప్రగతిని ప్రారంభించి, గ్రామ సభలో పాల్గొన్నారు. జగదాంబతండాలో పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, సముద్రలింగాపూర్లో 42 సామూహిక గొర్రెల షెడ్లు, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం గంభీరావుపేట మండలంలోని నాలుగు గ్రామాల్లో పర్యటించారు. మధ్యాహ్నం 1:35 గంటలకు రాజుపేటకు చేరుకున్న అమాత్యుడు అక్కడ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెప్రగతిని ప్రారంభించి, గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామంలో ‘మిషన్ భగీరథ నీళ్లు రోజూ వస్తున్నయా?’ అంటూ పలువురి ఇండ్ల లోపలికి వెళ్లి పలుకరించారు. వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటిస్త్తూ టీకా వేసుకున్నావా అవ్వా? అంటూ అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి 3 గంటలకు దేశాయిపేటకు చేరుకుని, దేశాయిపేట సర్పంచ్ కూడెల్లి చంద్రకళ భర్త ఎల్లం కరోనాతో మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అంతకుముందు ఎల్లం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎల్లం చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.5 లక్షల చెక్కు అందించారు.
ఇక్కడ మంత్రిని కలిసిన నర్మాల మాజీ ఉపసర్పంచ్ మహేశ్ తన వైద్య చికిత్సకు మరింత ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కేటీఆర్‌ను వేడుకోగా, వ్యాధి నయం అయ్యే వరకు ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 3:35 గంటలకు జగదాంబతండాలో రూ.20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కంపోస్టు షెడ్లో చెత్తతో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును పరిశీలించి ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. 4 గంటలకు గజసింగవరంలో నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు గృహంలో భోజనం చేశారు. అక్కడి నుంచి సాయంత్రం 5:05 గంటలకు సముద్రాలింగాపూర్కు చేరుకుని గొల్ల కుర్మల కోసం నిర్మించిన 42 సామూహిక గొర్రెల షెడ్లు, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఇక్కడ యాదవ సంఘ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ గొంగడితో సన్మానించి, గొర్రె పిల్లలను బహూకరించారు. అనంతరం 5:35 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.