మానేరు రివర్ ఫ్రంట్ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం
భూ నిర్వాసితులకు తగిన నష్టపరిహారం అందిస్తాం
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, జూలై 1: కరీంనగర్‌ను రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్ సమీపంలో నిర్మించిన ఏసీ, నాన్ ఏసీ బస్ బేలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం ప్రారంభించిన అది కరీంనగర్ నుంచే మొదలుపెట్టే వారన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో మొదటి అభివృద్ధి జీవో కరీంనగర్ రోడ్లకు ఇచ్చారన్నారు. విడుదల చేసిన రూ. 110 కోట్లతో నగరంలోని ప్రధాన రహదారులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆధునిక బస్ బేను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నగరానికి ఆస్తిగా నిలుస్తాయన్నారు. ఇవి పూర్తయితే పెద్ద కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నగర ప్రజలు కొరుకునే అభివృద్ధిని అందిస్తున్నామని తెలిపారు.
తగిన నష్టపరిహారం అందిస్తాం
మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్ల కోసం భూమి కోల్పోతున్న నిర్వాసితులకు తగినంత నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయ్యాయని, దానికి సంబంధించి అప్రోచ్ రోడ్లు చేపట్టాల్సి ఉందన్నారు. అయితే రోడ్డు విస్తరణ, అండర్ టన్నెల్స్ చేపట్టాల్సి ఉండడంతో అంచనా వ్యయం పెరిగిందన్నారు. ఈ నెలలోనే మానేరు రివర్ ఫ్రంట్‌కు సంబంధించిన డీపీఆర్ వస్తుందని, అది వచ్చిన వెంటనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూములను ఇచ్చే ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇరువైపులా ఒకే ధరతో నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారని, ఈ విషయం సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామన్నారు. భూ సేకరణ పూర్తి చేసి ఏడాదిన్నరలోగా మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపడుతున్నామని తెలిపారు. భూనిర్వాసితులు నష్టపోకుండా ప్రభుత్వం చూస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు వాల రమణరావు, కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.