వేములవాడ, జూన్ 8 : వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో గడ్డి స్కాం జరిగిందని, కోడెలకు గడ్డి వేయకుండా ప్రతి నెలా దాదాపు 5 లక్షల అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. కోడెలకు కనీసం కడుపునిండా తిండి పెట్టని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాజన్న భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీకైన కోడెలు మృత్యువాత పడడంలో ప్రథమ ముద్దాయి మంత్రి సురేఖనేనని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో అధికారిక లెకల ప్రకారం 33 కోడెలు మృతిచెందగా, ఆదివారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. కోడెల పరిస్థితిని చూసి చలించిపోయారు. అందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనే కారణమని తీవ్ర విమర్శలు చేశారు.
కలెక్టర్ కన్వీనర్‌గా ఉండి ఒక్కో రైతుకు రెండు కోడెలను మాత్రమే ఇవ్వాలన్న నిబంధనలను మంత్రి తుంగలో తొక్కారని మండిపడ్డారు. తన సిఫారసు లేఖ ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి గీసుకొండకు చెందిన రాంబాబుకు అక్రమ పద్ధతిలో 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. అందులో 49 కోడెలు మాయం కావడంతో గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై రాంబాబు జైలుకు వెళ్లిన విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయని చెప్పారు. దాంతో డిసెంబర్ నుంచి కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని, రాజన్న గోశాలలో 500 ఉండాల్సిన చోట 1300 ఉన్నాయన్నారు. ఇకడ అసలైన రాజకీయం ఎవరు చేస్తున్నారో ఆలోచించాలన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలు లంపి స్కిన్‌తో చనిపోతున్నాయని చెప్పడం ఆయనకున్న శ్రద్ధ ఏమిటో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ పశు వైద్యాధికారులే సరైన పోషకాహారం అందక చనిపోతున్నాయని వెల్లడిస్తున్నా కనీస వివరాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు గోశాలలో కోడెలకు గడ్డి వేయకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజుకు 10 టన్నుల చొప్పున గడ్డిని అందించేందుకు టెండర్ ప్రక్రియ నిర్వహించారని, పది టన్నుల గడ్డిని అందించాలనే కనీసం 25 ఎకరాల్లో పచ్చి గడ్డి వేసి ఉండాలని చెప్పారు. కానీ, సదరు కాంట్రాక్టర్‌కు 8 ఎకరాల వరకే ఉన్నట్టు తనకు సమాచారం ఉందని, అందులో ప్రతిరోజూ కేవలం రెండు టన్నులు మాత్రమే పచ్చి గడ్డి తెస్తున్నారని, మిగతా ఎనిమిది టన్నులు కాగితాల్లోనే చూపుతున్నారని ఆరోపించారు.
రోజుకు 16 వేల చొప్పున నెలకు దాదాపు 5 లక్షల వరకు స్కాం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కోడెల మృతి, గడ్డి స్కాంపై విచారణ జరపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు గోసుల రవి, నాయకులు పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, జోగిని శంకర్, నరాల శేఖర్, నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశం, బూరబాబు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వెంకట్ రెడ్డి, మల్లేశం, సత్యనారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.
వందల కోట్ల రూపాయలతో వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలిపింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే. ఇది మంత్రి సురేఖకు తెలియకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు చేపట్టే విస్తరణ స్థలం కూడా గత ప్రభుత్వం సేకరించినదే. ఆమెకు ఇది కూడా తెలవకపోవడం విడ్డూరం. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం రూపొందించిన నమూనాలు, అంచనాలతో కూడిన చిత్రాలు పత్రికల్లో వస్తున్నాయి. వాటినే కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభివృద్ధి అని ప్రచారం చేసుకుంటున్నది. కనీసం ఇప్పటివరకు డీపీఆర్, నమూనాలను కూడా రూపొందించలేదు. మీడియాలో వస్తున్న కథనాలను తాము చేయబోతున్నట్టుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. మరి ఇలానే కొనసాగుతాయా.. లేవా? అనేది కూడా వెల్లడింలి.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సమావేశం నిర్వహించి జూన్ 15 నుంచి రాజన్న ఆలయాన్ని బంద్ చేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేశారు. ఆలయం మూసివేస్తారన్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం 20వేల నుంచి 30వేల మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. కానీ, కనీస వసతి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భక్తులు గంటల తరబడి నిరీక్షించి క్యూ లైన్లో పడిపోతున్న పట్టించుకోవడంలేదు. రద్దీకి తగినట్టు సౌకర్యాలు కల్పించాలి.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు