Dharmaram | ధర్మారం, ఫిబ్రవరి 24: నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో అగ్రవర్ణాలు జరిపిన దాడిలో నెలల పసిపాప మృతికి నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక రజక సంఘం నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. పాత బస్టాండ్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు.
పసిపాప మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘం నాయకులు స్థానిక తహసీల్దార్ డీ శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొరే గ్రామంలో ఇటీవల జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఆలయంలోకి రజకులు టికెట్ లేకుండా ప్రవేశించారని నెపంతో అక్కడి అగ్రవర్ణాల వారు దాడి చేయడం సిగ్గు చేయటానికి అన్నారు.
ఈ దాడిలో రెండు నెలల పసిపాప మృతి అగ్రవర్ణాల దౌర్జన్యానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు చర్య తీసుకొని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు అర్ధవెల్లి రాము, కాలువ నర్సింగం, నేరెళ్ల లింగయ్య, అంబేద్కర్ సంఘం నాయకుడు దేవి రాజలింగయ్య తదితరులు పాల్గొన్నారు.