Gosangi residents | తిమ్మాపూర్, ఆగస్టు30; వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు ఓ కన్నేయాల్సిందే. అధికారులు వెళ్లే వరకు వారూ బిక్కుబిక్కుమంటూ గడపటమే. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే గోసంకి వాసులు కూలిన ఇండ్లలోనే వెల్లదీస్తున్నారు. ఎక్కడ ఏ ప్రమాదం పొంచిఉంటుందోనని ప్రతీ వర్షాకాలం అధికారగణం అప్రమత్తమై ఏదో హామీ ఇచ్చి వారిని అక్కడి నుండి తరలించడం, మళ్లీ వాళ్లు అక్కడికే వెళ్లి ఉండడం జరుగుతున్నాయి.
మూడు, నాలుగేండ్లుగా తీవ్ర ఇబ్బందులు..
కొన్నేండ్ల కింద ఎల్ఎండీ రిజర్వాయర్లో భూ నిర్వాసితులైన గ్రామస్తులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేసింది. ఆ సమయంలో అందరూ గ్రామంలో మరోచోట భూములు కొనుగోలు చేసుకుని పక్కా ఇండ్లు నిర్మించుకున్నారు. అయితే అప్పుడు వచ్చిన పరిహారం సరిపోకపోవడంతో కొంతమంది వారి ఇండ్లలోనే నివాసం ఉన్నారు. ఈ క్రమంలో గత మూడు, నాలుగేళ్లుగా పూర్తిగా పాడైన ఇండ్లల్లోనే కాలం గడుపుతున్నారు.
పట్టాలిచ్చిన రసమయి..
గోసంగి వాసులకు మూడేండ్ల కింద అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారి దుస్ధితి చూడలేక నేదునూర్ శివారులో గ్రామస్తులతో పాటూ వీరికి సుమారు 25కుటుంబాలకు ఇండ్ల స్థలాలను అందజేశారు. అలాగే వీరికి ఇండ్లు కూడా మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో భూములు ఉన్నాయి, కానీ ఇండ్ల మంజూరు రద్దయ్యాయి. దీంతో వారు అలాగే అక్కడే కూలిపోతున్న ఇండ్లలోనే ఉంటున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు..
వర్షాకాలం వచ్చి, భారీ వర్షాలు పడుతున్నాయంటే చాలు.. అందరి చూపు గోసంకికాలనీ వైపు ఉంటుంది. భారీ వర్షాలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించడం, అనంతరం మళ్లీ వారు అక్కడికే వెళ్లడం జరుగుతున్నది. ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 25 కుటుంబాల్లోని కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంజూరు చేసిన ఫ్లాట్లలో కొద్దిమంది ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నారు.
మరికొంతమందికి ఫ్లాట్లు ఉన్నప్పటికీ ఇండ్లు మంజూరు కాకపోవడంతో మా పరిస్థితేంటని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ అక్కడికి వెళ్లి వారిని సముదాయించి ఇండ్లు ఖాళీ చేయాలని సూచించారు. అయినప్పటికీ తమకందరికీ ఇండ్లు వస్తేనే వెళ్తామని స్పష్టంగా వారు చెబుతున్నారు. వచ్చే వర్షాకాలంలోపైనా వారికి ఇబ్బందులు లేకుండా చేయాలని స్థానిక తాజా మాజీ సర్పంచి వడ్లూరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.