పెద్దపల్లి, మే 10 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయత్రం కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంతోపాటు ధర్మారం మండలంలో కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బలమైన గాలులతోపాటు వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కళ్ల ముందే వాననీటిలో కొట్టుకుపోతుంటే రైతులు తల్లడిల్లిపోయారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మారెట్ యార్డు, ధర్మారం మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
వరద ఉధృతికి కొందరు రైతుల ధాన్యం కొట్టుకుపోయింది. అకాల వర్షంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. జిల్లా కేంద్రంలో 153 మిల్లీ మీటర్ల వర్షం పడగా, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో 2.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు పడిపోగా, రవాణాకు ఆటంకం ఏర్పడింది. ప్రధాన రహదారులపై వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. బలమైన ఈదురుగాలులతో జిల్లా కేంద్రంతోపాటు చుట్టూ పక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వృక్షాలు నేలకొరగడంతో పాటు స్తంభాలు కింద పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. సాయంత్రం 6గంటలకు నిలిచిపోయిన విద్యుత్ రాత్రి వరకు కూడా రాకపోవడంతో ప్రజలకు ఆంధకారంలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.