కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కడగండ్లే మిగిల్చింది. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఎండబోసిన ధాన్యం తడిసిపోగా, రైతులు లబోదిబోమన్నారు. అప్పారావుపేట గ్రామంలో ధాన్యం రాశులపై కవర్లు లేచిపోగా, ధాన్యం కొట్టుకుపోయింది. గంగాధర మండలంలోని అన్ని గ్రామాలతో పాటు రామడుగు మండలం వెలిచాల, వెదిర, దేశరాజ్‌పల్లి, షానగర్, పందికుంటపల్లి, కిష్టాపూర్, వన్నారం, కొక్కెరకుంట గ్రామాల్లో అకాల వర్షం గంటపాటు కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కాగా, తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు.శంకరపట్నం మండలం మొలంగూర్‌లో కాలేషు సంపత్ ఇంటి పై కప్పు రేకులు ఎగిరిపోయాయి.
కేశవపట్నం-కరీంపేట్ దారిలో, కేశవపట్నం ఎత్తుగడ్డ వద్ద చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభం నేలకొరిగి, సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆముదాలపల్లిలో తాటి చెట్టుపై పిడుగుపడి మంటలు లేచాయి. తాడికల్, వంకాయగూడెం గ్రామానికి చెందిన గంట గణేశ్, నరాల కొమురయ్య బైక్‌పై హుజూరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులకు బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో దవాఖానకు తరలించారు. కాగా, ఈదురు గాలులకు విద్యుత్‌శాఖకు రూ.3లక్షల నష్టం వాటిల్లినట్లు మానకొండూర్ ఏఈ ఆర్ సత్యనారాయణ తెలిపారు. రంగపేట, వెల్ది, వేగురుపల్లి, మానకొండూర్ గ్రామాల్లో నాలుగు ట్రాన్స్ఫార్మర్ల స్ట్రక్చర్స్ నేల కూలాయని, 10 కరెంట్ పోల్స్ విరిగిపోయాయని, తీగలు తెగిపడ్డాయని చెప్పారు. మానకొండూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు జగ్గయ్యపల్లి, లక్ష్మీపూర్, ఈదులగట్టెపల్లి, రంగపేట, వెల్ది, వేగురుపల్లి గ్రామాల్లోని మామిడి కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.