గతేడాది అక్టోబర్ వరకు ఉత్సాహంగా కనిపించిన ప్రభుత్వ పాఠశాలల్లో నేడు నిరుత్సాహం గోచరిస్తున్నది. పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు తెచ్చిన పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కడంతో విద్యార్థులు ఆకలితో అలమటించే దుస్థితి కనిపిస్తున్నది. సీఎం బ్రేక్‌ఫాస్ట్, రాగిజావ పథకాలతోపాటు పది ప్రత్యేక తరగతుల సమయంలో అందించిన ఉత్తేజ అల్పాహారం సైతం నిలిచిపోవడం, కొత్తగా వచ్చిన సర్కారు స్పష్టత నివ్వకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చదువులు మళ్లీ కొండెక్కే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం సైతం పౌష్టికాహారం ఇవ్వాలన్న సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకానికి నాంది పలికింది. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం, బడి పిల్లల హాజరు పెంచడం, డ్రాపౌట్స్‌ను తగ్గించడం, పిల్లల సామర్థ్యం పెంపే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు అల్పాహారం మెనూను రూపొందించారు.
ఇడ్లీ సాంబార్/గోధుమరవ్వ, పూరి ఆలూ కూర్మా/టమాటా బాత్, ఉప్మా సాంబార్/రైస్, రవ్వ, ఇడ్లీ సాంబార్/పొంగల్, ఉగ్గాని/పోహా/గోధుమరవ్వ, కిచిడి, పొంగల్/వెజిటెబుల్ పలావ్‌ను మెనూలో పొందుపర్చారు. ఈ పథకం అమలు బాధ్యతలను విద్యాశాఖతోపాటు, పంచాయతీరాజ్, మాతా శిశు సంక్షేమశాఖ, ఆరోగ్యశాఖలకు అప్పగించి సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. అల్పాహారం తయారు చేసే విధులను మధ్యాహ్న భోజన తయారీదారులకు ఇచ్చారు. గతేడాది అక్టోబర్ 6న సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు.
దసరాకు ముందు ప్రారంభించిన ఈ పథకాన్ని సెలవుల అనంతరం అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్దేశించారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని పాఠశాలల్లో మాత్రమే అమలు చేశారు. అయితే మధ్యాహ్న భోజన నిర్వాహకులు రెండు మూడు నెలల పాటు సక్రమంగా అల్పాహారం అందించినా.. ఆ తర్వాత బిల్లులు రాక సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ను ఇవ్వడం మానేశారు. అయితే డిసెంబర్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఈ పథకంపై తన వైఖరిని ప్రకటించ లేదు. దాంతో జిల్లా వ్యాప్తంగా ఈ అల్పాహార కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది.
నిలిచిన రాగిజావ పథకం
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి సోమ, బుధ, శుక్రవారం కోడిగుడ్డును అందిస్తూ వస్తున్నారు. మిగిలిన మూడు రోజుల్లో పిల్లలకు బలవర్థక ఆహారం కోసం రాగి జావను అందించారు. అందులో 8 శాతం ప్రొటీన్స్, 70 శాతం పిండిపదార్థాలు, 20 శాతం పీచు, 2 శాతం మినరల్స్ ఉండేలా చూశారు. ఇక ఉన్నత పాఠశాలల బాలికల్లో రక్తహీనత నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఐరన్‌ను అందించారు. ప్రతి బాలికకు రాగిజావతోపాటు పదిగ్రాముల బెల్లం ఇచ్చారు. అయితే, జగిత్యాల జిల్లాలో ఇవేవీ ప్రస్తుతం పాఠశాలల్లో అందించడం లేదని పిల్లలు చెబుతున్నారు.
పది ప్రత్యేక తరగతుల్లో ఆకలి కేకలు
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 187 ఉన్నత పాఠశాలల్లో 5,460 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరు మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ ఫలితాల కోసం రాష్ట్ర విద్యాశాఖ గతేడాది నవంబర్ నుంచే ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రతి పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం తరగతులను నిర్దేశించింది. పదో తరగతి బోధించే సబ్జెక్ట్ టీచర్లు ఉదయం గంట, సాయంత్రం గంట ప్రత్యేక తరగతులు బోధించాలని ఆదేశించింది.
ఈ మేరకు టైమ్‌టేబుల్ సైతం రూపొందించి అమలు చేస్తున్నారు. అలాగే, పది విద్యార్థులకు, రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు చేరుకుంటున్న పది విద్యార్థులు సాయంత్రం 5.40 నిమిషాల వరకు (మినిమమ్) ఉండాల్సి వస్తున్నది. దాదాపు పది గంటల పాటు పిల్లలు పాఠశాలల్లోనే ఉండి విద్యాభ్యాసం చేస్తుండగా, అదనపు తరగతుల సమయంలో అల్పాహారం లేక ఆకలితో అలమటించే దుస్థితి వచ్చింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం పది పిల్లలకు అదనపు తరగతుల సమయంలో ప్రత్యేక అల్పాహారాన్ని అందించింది. జగిత్యాల జిల్లాలో కలెక్టర్లు ఉత్తేజం పేరిట, వారి ప్రత్యేక నిధుల నుంచి నిధులు కేటాయించి, పిల్లలకు ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం అందిస్తూ వచ్చారు. అప్పటి ప్రభుత్వం సైతం దీనికి అనుమతులు ఇచ్చింది. అయితే, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పది పిల్లలకు అదనపు తరగతుల్లో అల్పాహారం కోసం నిధులు ఇవ్వకపోవడంతో ఈ పద్ధతి అమలు కావడం లేదు.