రుణమాఫీ ప్రక్రియ ఒడువని ముచ్చటలా సాగుతున్నది. సాగదీతతో రైతులు మాఫీ కోసం కండ్లల్లో వత్తులు వేసుకొని చూడాల్సి వస్తున్నది. మల్లాపూర్ మండలం రాఘవపేటలో 700 మందికి కేవలం 18 శాతం (126) మందికే మాఫీ కాగా, మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ చేస్తాంటూ ఊరించి ఉసూరుమనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వద్దకు వెళ్తే సరైన సమాధానం రాక మూడు రోజులుగా గ్రామంలో ఇల్లిల్లూ తిరుగుతూ రుణమాఫీ పొందని 450 మంది పేర్లతో జాబితాను రూపొందించారు. మిగిలిన వారి పేర్లను సేకరించి, మాఫీ అయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
జగిత్యాల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/మల్లాపూర్: వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం రాఘవపేట. ఎటు చూసినా పచ్చని పైర్లతో చిన్న, సన్నకారు రైతుల సేద్యంతో అందంగా కనిపించే ఊరు ఇది. ఈ గ్రామంలో దాదాపు 800 మంది రైతులు సేద్యం చేస్తుండగా, అందులో 700 మంది వ్యవసాయం కోసం రుణాలు పొందారు. రాఘవపేట సమీపంలో ఉన్న ముత్యంపేటలో ఇండియన్ బ్యాంక్ శాఖ ఉన్నది. అలాగే గ్రామంలో కేడీసీసీ బ్యాంకు మెట్‌పల్లికి చెందిన బ్రాంచ్‌కు చెందిన సబ్ శాఖ సేవలందిస్తున్నది. ఈ రెండింటిలో రైతులు ఖాతాదారులుగా ఉండి పంట రుణం పొందారు. ముత్యంపేటలో ఉన్న ఇండియన్ బ్యాంకు పరిధిలో దాదాపు 200 మంది, మరో 500 మంది వరకు కేడీసీసీ బ్యాంకు పరిధిలో రుణం పొందారు.
వీరంతా రుణమాఫీ కోసం ఆశగా ఎదురు చూస్తూ వచ్చారు. జూలై 18న ప్రభుత్వం లక్షలోపు రుణం ఉన్న వారికి మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి జాబితా ఇవ్వగా, అందులో చాలా మంది పేర్లు రాలేదు. ఇండియన్ బ్యాంకు పరిధిలో రుణం పొందిన ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. ఇదేంటని బ్యాంకు అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను కలిసి అడిగితే ‘సాంకేతిక లోపం వల్ల పేర్లు రాలేదు. అన్ని కలిపి రెండో జాబితాలో వస్తాయి’ అని చెప్పడంతో మిన్నకుండి పోయారు.
జూలై 31న ప్రకటించిన లక్షన్నరలోపు రుణానికి సంబంధించిన రెండో జాబితాలోనూ పేర్లు కనిపించపోవడంతో ఆందోళన చెందారు. అధికారులను కలిసి విన్నవిస్తే మూడో జాబితాలో వస్తాయని పేర్కొన్నారు. ఆగస్టు 15న విడుదలైన 2లక్షలలోపు రుణానికి సంబంధించిన మూడో జాబితాలోనూ పేర్లు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని రాఘవపేట రైతులు ఆవేదన చెందారు.
మాఫీ కాకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రాఘవపేట రైతులు, సమష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి, రుణం పొందిన రైతుల వివరాలు, రుణమాఫీ జరగని రైతుల వివరాలు సేకరించే పనిని ప్రారంభించారు. మూడు రోజుల వ్యవధిలో రుణమాఫీ జరుగని 450 మంది రైతుల వివరాలతో జాబితాను రూపొందించారు. మిగిలిన వారి వివరాలను సైతం సేకరించిన తర్వాత గాంధేయ మార్గంలో ప్రభుత్వంపై రైతులు నిరసన దీక్ష మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
800 మంది రైతులు ఉన్న తమ గ్రామంలో 700 మంది రైతులు రుణాలు పొందారని, అందులో 18 శాతంతో 126 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఇంతకంటే దారుణం మరొక్కటి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500 మందికి పైగా రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో లేకపోవడం అత్యంత అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పేరిట తమను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఊళ్లె నాకు మూడెకరాల పొలం ఉన్నది. నేను, నా కుటుంబం అంతా ఎవుసం చేసే బతుకుతున్నం. ఏడాది కింద ముత్యంపేట ఇండియన్ బ్యాంకుల 1.60లక్షలు రుణం తీసుకున్న. కానీ మాఫీ కాలేదు. నాలుగైదు రోజుల సంది అర్థమైతలేదు. సర్కార్ గిట్ల జేసుడు న్యాయం కాదు. ఎందుకు మాఫీ కాలేదు? అని అడిగితే చెప్పే నాథుడే లేడు. పైకెల్లి నీ పేరు రాలేదు. అందుకే కాలేదంటున్రు. ఏం జరిగిందో..? ఏందో తెలువదు. ఊరించి.. ఊరించి ఉసూరు మనిపించిన్రు. సర్కార్ లెక్క సరికాదు. ఇత్తె ఇత్తమని చెప్పాలే. లేకుంటే లేదని చెప్పాలె గని గిట్లాంటి పాయిదార్ల ముచ్చట్లు చెప్పి మోసం చేసుడు మంచిగ లేదు.
– గాండ్ల నారాయణ, రాఘవపేట
నాకు ఐదెకరాల భూమి ఉంది. రెండెకరాలు మక్క ఏస్త. మూడెకరాలు పొలం జేత్త. ఇది తప్ప నాకు ఇంకోపని తెలియదు. ముత్యంపేట ఇండియన్ బ్యాంకులో 2018లో 1.80 లక్షలు లోన్ తీసుకున్న. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకుంటూ వస్తున్న. మిత్తి ఎప్పటికప్పుడు కడుతూనే ఉన్న. నాకు అన్ని అర్హతలు ఉన్నయి. అయినా నాకు రుణమాఫీ కాలేదు. కేసీఆర్ సార్ ఇచ్చినప్పుడు నయం సార్. ఆయన లక్ష లోపు లోన్ ఉన్నవారికి మాఫీ చేస్తామన్నడు. అన్నట్లే చేసిండు. ఇప్పుడీ కాంగ్రెస్ 2లక్షలు చేస్తమన్నది. తీరా చూస్తే మస్తు మంది రైతుల పేర్లు జాబితాలో లేకుండాపోయినయి. ఇదేం కథనో అర్థమైతలేదు. ఇస్తే ఇస్తం అనాలే లేకుంటే లేదని చెప్పాలే. గిట్ల మోసం చేయడం మంచిగలేదు.
– గంగాధరి శంకర్, రాఘవపేట
నాకు ఊళ్లె రెండెకరాల పొలం ఉంది. ఈ పొలంపైనే ఆధారపడి నేను నా భార్యా పిల్లలు బతుకుతున్నం. ఎవుసం కోసం కేడీసీసీబీ బ్యాంకు రాఘవపట్నం బ్రాంచ్‌ల లక్ష లోన్ తీసుకున్న. మిత్తి ఎప్పటికప్పుడు కట్టుకుంటనే వస్తున్న. అయినా నాకు రుణమాఫీ కాలే. ఫస్ట్ లిస్టులనే కావాలే కానీ, నా పేరు రాలే. సార్లను అడిగితే రెండో లిస్టుల వస్తదన్నరు. రెండో లిస్టుల రాలేదు. మూడో లిస్టుల రాలేదు. ఏంది కథ అంటే ఆధార్‌కార్డుకు పాస్పుస్తకానికో, ఇంకదేనికో కర్టెక్ సరిపోతలేదు. అందుకే రుణ మాఫీ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పిన్రు. లక్షకే గింత కథ ఉన్నది. మునుపు కేసీఆర్ హయాంలో నాకు లక్ష రూపాయల వరకు మాఫీ అయ్యింది. ఇప్పుడు గిట్ల జేసుడు మంచిగా లేదు.
– బెజ్జారపు ముత్యాలు, రాఘవపేట
నా భర్త వెంకటరెడ్డికి పేరుపొంట ఆరెకరాల భూమి ఉంది. బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిండు. ఇద్దరు పిల్లలు. బిడ్డకు పెండ్లి చేసినం. కొడుకు ఏడో తరగతి చదువుతుండు. నేను ఇక్కడ ఎవుసం చేస్త. మా ఆయన పేరుమీద ముత్యంపేట ఇండియన్ బ్యాంక్‌ల 1.56 లక్షలు పంట లోన్ తీసుకున్నం. అయితే దుబాయ్‌కి పోయినంక మిత్తి కట్టుడు కట్టమైతదని ఇద్దరిపేరిట జాయింట్ ఖాతా తీయించిండు. నేనే బ్యాంకుల మిత్తి కడుతున్న. సీఎం సార్ రుణమాఫీ అయితదని చెప్పిండు కదా అని అనుకున్న. బ్యాంకుకు పోయి అడిగితే లిస్టుల మా పేరు లేదన్నరు. సార్లను అడిగితే ‘మీకు జాయింట్ ఖాతా ఉంది కదా, అందుకే రాదు’ అంటున్నరు. ఇదేం లెక్క సార్. జాయింట్ ఖాతా ఉంటే రుణమాఫీ కాదా..? ఏం అర్థమైతలేదు. ఎవరిని అడిగినా లాభం లేదు. అడిగీ అడిగి యాష్టకు వస్తున్నది. గిట్ల చేసుడు కరెక్ట్కాదు సార్. మా ఆయన దుబాయ్‌ల ఉండె. నేను ఒక్కదాన్ని ఎట్ల తిరుగాలే సార్.
– మెకార్తి గంగమణి, రాఘవపేట
నా పేరు మీద 5.20 ఎకరాలు, నా భార్య లక్ష్మికి 1.20 ఎకరాల భూమి ఉన్నది. ఇద్దరం రైతులమే. వేర్వేరుగా పట్టాదారులు బుక్కులు ఉన్నయి. భూమి గూడా వేర్వేరు చోటనే ఉంది. నేను ముత్యంపేట ఇండియన్ బ్యాంకుల 2018లో 1.50 లక్షల పంట లోన్ తీసుకున్న. అప్పటి సంది ఏటా వడ్డీ చెల్లించి లోన్‌ను రెన్యువల్ చేసుకుంటూ వస్తున్న. నాకు రెండో దఫానే మాఫీ కావాలే. కాలేదు. మూడో జాబితాలోను నాపేరు రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. ఇక నా భార్య లక్ష్మికి సైతం ఇండియన్ బ్యాంకు పరిధిలోనే 40వేలు లోన్ తీసుకున్నది. ప్రతి సారి మిత్తి కట్టి రెన్యువల్ చేస్తున్నది. ఆమె లోన్ సైతం మాఫీ కాలేదు. ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణమాఫీ అంటున్నారు. మా ఇద్దరి రుణం కలిపి గూడా రెండు లక్షలు లేదు. మాలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే. సర్కార్ చెప్పే ముచ్చట్లు అన్ని బోగస్ లెక్కనే ఉన్నయి. నూటికి ఇరవై శాతం మంది లోన్లు మాఫీ కాలేదు.
– దేశెట్టి నగేశ్, రాఘవపేట
సార్ నాకు నలుగురు ఆడపిల్లలు, భార్య చనిపోయింది. నాకు ఉన్నదే ముత్తెమంత జాగ ఎకరంన్నర భూమి. అండ్ల నేను తీసుకున్నది గుడా తక్కువే. నాకు గూడా రాలేదు. ఉన్న కొద్దిపాటి భూమిని చేసుకుంటనే బతుకుతున్న. నలుగురు పిల్లలను సాదుతున్న. ముత్యంపేట ఇండియన్ బ్యాంకులో 2018లో 40వేలు లోన్ తీసుకున్న. అప్పటి సంది ఏటా లోన్ కట్టి, మళ్లా ఎత్తుకుంటున్న. లోన్మాఫీ చేస్తమంటే అంటే నిజమే అని నమ్మిన. పోయిన నెలలో లక్ష లోపు ఉన్నవాళ్లకు మాఫీ చేస్తమన్నరు. అప్పుడు ఆశపడ్డ. నాపేరు రాలేదు. బ్యాంకు సార్లను కలిసిన. పేరు తప్పిపోయింది. మళ్లా రెండోసారి లిస్టుల వస్తదన్నరు. అప్పుడు రాలేదు. మూడో లిస్టుల కూడా రాలేదు. ఇప్పుడు అడిగితే ఏమో మాకేం తెలుసు అంటున్రు.
– పడిగెల చిన్నరాజం, రాఘవపేట