Dharmaram | ధర్మారం, ఆగస్టు 23 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు సింగపూర్ పర్యటనకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్లోరర్ విజిట్ కార్యక్రమంలో కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో భాగంగా సింగపూర్ పర్యటనకు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్ ఈ మేరకు ఎంపికైన 29 మంది ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేశారు. అందులో పెద్దపల్లి జిల్లా నుంచి రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వంశీ మోహనాచార్యులు ఎంపికయ్యారు.
గ్లోబల్ బోధనా పద్ధతులను నేర్చుకునేందుకు కలెక్టర్ అధ్యక్షతన రాత పరీక్ష, డెమో క్లాస్, ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. అందులో వంశీ మోహనాచార్యులు ఉన్నారు. తాను హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రచ్చపల్లి పాఠశాలలో అనేక వినూత్న విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన ఉపాధ్యాయుడిగా వంశీ మోహనాచార్యులు మంచి గుర్తింపు పొందారు. కాగా వచ్చేనెల సెప్టెంబర్ 12 నుండి 19 వరకు 8 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో సింగపూర్ దేశంలో విద్యా విధానాలు, బోధనా పద్ధతులపై అధ్యయనం చేసి, తిరిగి వచ్చి ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తారు. కాగా వంశీ మోహనాచార్యులు ఎంపిక పట్ల మండల ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయబృందం, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు వంశీ మోహనాచార్యులకు అభినందనలు తెలిపారు.