కమాన్‌పూర్, జనవరి 10 : పంటలకు సాగునీరందించే విధానంపై మంథని ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కమాన్‌పూర్ మండలం గుండా రం రిజర్వాయర్‌ను రైతులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఎనిమిది పీట్ల మేర మాత్రమే నీళ్లున్నాయని, 12 పీట్లు ఉంటేనే కింది ప్రాంతాలకు నీళ్లు విడుదల చేసే అవకాశముంటుందని చెప్పారు. అయితే జనవరి పదో తేదీ వ చ్చినా ఇప్పటివరకు శ్రీరాంసాగర్ నీళ్లు రాలేదని, అసలు నీళ్లు వస్తాయా.. రావా..? అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. గతేడాది సైతం నీళ్లు వస్తాయనే నమ్మకంతో పంటలు సాగు చేశారని, తీరా నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు.
సాగునీటి విషయంలో ఇప్పటివరకు మంత్రి ఏమి మాట్లాడడం లేదని, కనీసం కలెక్టర్ ద్వా రానైనా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఎస్సారెస్పీ ఈ ఈ సాగునీటి విషయమై మీటింగ్ పెట్టినట్టు పత్రికలో చూశానని, కానీ ఏలాంటి స్పందన లేదన్నారు. ఈఈని కలిస్తే రేపటి సాయంత్రం వరకు నీళ్లు వస్తాయని చెప్పారని తెలిపారు.
పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం శ్రీరాంసాగర్, ఎస్సారెస్పీ ద్వారా గుండారం రిజర్వాయర్‌లోకి నీటిని తరలించి, రెండు పంటలు సాగు చేసుకునేలా నీరందించామని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత మంత్రి మాత్రం సాగునీటి విషయంలో మాట్లాడడం లేదని, మా మాటలు పట్టించుకోవడం లేదన్నారు. ఆనాడు తాము అధికారంలో ఉన్నప్పుడు పనులు చేసి ప్రజలకు దగ్గరయ్యాయని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
సాగునీటి విషయంపై వెంటనే స్పష్టత ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ శంకర్, మండల యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, రామగిరి పార్టీ మండలాధ్యక్షుడు శంకేసి రవీందర్, నాయకులు సాయికుమార్, సతీశ్, రాచకొండ చంద్రమౌళి, ఆకుల గట్టయ్య, రాచకొండ రవి, కొండ వెంకటేష్, ఆకుల కిరణ్, తోడేటి రాజీర్, బొల్లపల్లి శంకర్ గౌడ్, సింగం శ్రీనివాస్, తోట రాజ్‌కుమార్, దండె రమేశ్, పంతకాని రవి, ఆకుల తిరుపతి, పిడుగు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.