కరీంనగర్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రోహిణీ’ వచ్చేసింది.. సోమవారం నుంచే కార్తె మొదలవుతున్నది.. వానకాలం సాగును ప్రారంభించేందుకు ఇది మంచిరోజని, ఇప్పుడు ఎవుసం ప్రారంభిస్తే రాబడి మంచిగా వస్తుందని రైతులు భావిస్తున్నారు. అయితే యాసంగి ధాన్యం కొనుగోళ్లు నేటికీ పూర్తికాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయంలో కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. పోయిన సీజన్లో యారియా సరిగ్గా దొరక్క, అందరికీ రైతు భరోసా పడక తీవ్ర ఇబ్బందులు పడ్డామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పంట కొనకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదని, రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదని, పెట్టుబడి ఎలా తెచ్చేదని వాపోతున్నారు.