జగిత్యాల, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘జగిత్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూకబ్జా..? శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమైంది. 1952లో జగిత్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ విక్రయాల కోసం సంబంధిత బర్మాషల్ కంపెనీ డీలర్‌కు 138 సర్వేనంబర్‌లో మున్సిపాలిటీ కొనుగోలు చేసిన 20 గంటల భూమి ఇవ్వడం, ఆ తర్వాత భూమిని పెట్రోల్ బంక్ నిర్వాహకుడు, ఆయన తదనంతరం వారసులు కిబాల పత్రంతో మున్సిపల్ వద్ద కొనుగోలు చేశామని చెప్పి పట్టాదారులుగా మారిన వ్యవహారాన్ని కథనంలో వివరించింది.
ఈ నేపథ్యంలో కిబాల పత్రంపై నెలకొన్న అనుమానాలు, మున్సిపల్ తనకు సంబంధించిన వందల కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో చూపిన ఉదాసీనత, పాలక వర్గాల పట్టింపు లేని తనం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యపూరిత వైఖరి తదితర అన్ని అంశాలను ఎత్తిచూపింది. ఈ కథనం అన్ని వర్గాల్లో ఒక చర్చకు దారి తీయగా, ‘నమస్తే’ కథనంపై కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై పూర్తి విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల అదనపు కలెక్టర్ నేతృత్వంలోని విచారణ కమిటీని వేశారు.
అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) రాజాగౌడ్‌ను కమిటీ చైర్మన్‌గా, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందనను సభ్యులుగా నియమించారు. మూడు నాలుగు రోజుల వ్యవధిలో మున్సిపాలిటీకి సంబంధించిన 20 గుంటల భూమిపై సంపూర్ణ విచారణను జరిపి నివేదికను అందించాలని ఆదేశించడంతోపాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం. 1952లో మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత ‘మున్సిపల్ లోకల్ ఫండ్’ నుంచి కొనుగోలు చేసిన భూమి వివరాలు, అందులో నుంచి పెట్రోల్ బంక్‌కు జరిపిన కేటాయింపుల వివరాలు, తదుపరి న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు, తీర్మానాలన్నింటినీ సమర్పించాలని ఆదేశించారు.
అలాగే 1946 సేత్వార్ నుంచి మొదలు కొని ఈ యేడాది వరకు ఉన్న పహానిలు, కిబాల పత్రం నకలు కాపీలు ఇతర వివరాలన్నింటినీ నివేదించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రెవెన్యూ, మున్సిపల్ రికార్డుల పరిశీలన తదుపరి, వ్యాపారికి సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, సామాన్యుడు ఒకటి రెండు అడుగులు సెట్‌బ్యాక్ కాకపోతేనే జరిమానాలు, విచారణలు, కూల్చివేతలు చేపట్టే మున్సిపల్ అధికారులు.. రూ.100 కోట్లకు పైగా విలువైన మున్సిపల్ భూమి దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా అన్యాక్రాంతం కావడంపై పట్టణవాసులు తీవ్ర అసహనం చేస్తున్నారు.
20 గుంటల స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెద్దపెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ వ్యవహారం వెనకాల ఉండడం వల్లే వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, 20 గుంటల స్థలాన్ని తిరిగి మున్సిపల్ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్యమించాలన్న ఆలోచన జిల్లా కేంద్రంలోని కొన్ని వర్గాలు నేతలు, ప్రజా సంఘాల నాయకులు చేశారు. త్వరలోనే సమావేశం నిర్వహించి, స్థలాన్ని సాధించేందుకు ఉద్యమ కమిటీని రూపొందించుకొని, వివధ మార్గాల్లో ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.
