Protocol | కోల్ సిటీ, జూలై 26: రామగుండం నగర పాలక సంస్థలో అధికార పార్టీ నాయకులే ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు మంజూరయ్యాయి.ఈ క్రమంలో శనివారం నగరంలోని 47వ డివిజన్ (పూర్వ 26వ డివిజన్) శ్రీ దుర్గా కాలనీలో ప్రధాన రోడ్డు నుంచి ఆర్కే గార్డెన్ కల్వర్టు వరకు యూజీడీ పనులను కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కొబ్బరికాయలు కొట్టి భూమిపూజ చేయడంపై విమర్శలు తలెత్తాయి. అక్కడితో ఆగకుండా భూమిపూజ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికులను నివ్వెరపరిచింది.
ఏ హోదాలో భూమిపూజ చేస్తున్నారని పలువురు ప్రశ్నించారు. నగర పాలక సంస్థ నిధులతో చేపట్టబోయే భూగర్భ డ్రైనేజీ పనులను అధికారులు గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ అధికారికంగా భూమిపూజ చేయడం అనేది అనవాయితీ. కానీ, శనివారం నగర పాలక సంస్థ కమిషనర్ గానీ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు గానీ లేకుండానే 47వ డివిజన్ లో యూజీడీ పనులకు భూమిపూజ చేసి జేసీబీతో ప్రారంభించారు. అక్కడ రోడ్డు కూడా కొద్దిగా డ్యామేజీ కలిగింది.
గతంలో ఎన్టీపీసీ కృష్ణానగర్ లో రోడ్డుకు ఓ కాంట్రాక్టర్ డ్యామేజీ కలిగించాడని అతనిపై కేసు కూడా నమోదు చేయించారు. మరి 47వ డివిజన్లో అలాంటి నిబంధనలు వర్తించవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ విషయమై నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారిని వివరణ కోరగా, ఆ డివిజన్ లో యూజీడీ పనుల ప్రారంభంకు తమకు ఏలాంటి సంబంధం లేదనీ, మున్సిపల్ నుంచి వారికి ఏలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.