Congress | పెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ రాజకీయాల్లో ఏకాకిగా మారాడు. తన పార్లమెంటు పరిధిలో తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో ఎంపీకి ఎక్కడా ప్రొటోకాల్ దక్కడం లేదు. ఈ నెల 15న మంథని నియోజకవర్గంలోని కాళేశ్వర పుణ్యక్షేత్రం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమై 12రోజుల పాటు అధికారికంగా కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న పుష్కరాల ప్రారంభ కార్యక్రమానికే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి ఆహ్వానం అందలేదనే విషయం తేట తెల్లం అయ్యింది.
దీనికి తోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీల్లో సైతం ఎంపీ ఫొటోలను పెట్టకపోవడంతో ఆయన అనుచరులు ప్లకార్డులు చేతబట్టి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన తెలిపారు. దీంతో గత కొంత కాలంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొద్దిరోజులుగా మంత్రి, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీగా కొనసాగుతున్న ప్రొటోకాల్ చిచ్చు రచ్చకెక్కింది. పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి ముగిసే వరకూ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక వైపు గడ్డం వంశీకి వ్యతిరేఖంగా పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాల, లక్సెట్టిపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎంపీ తీరును ఎండగట్టారు. దీనికి తోడు ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు గజ్జెల కాంతం సైతం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం పెద్దపల్లికి వచ్చి ఎంపీ తీరుపై విమర్శనాస్ర్తాలు సందించారు.
ఇలా పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దపల్లి ఎంపీకి వ్యతిరేఖంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేఖ స్వరాన్ని వినిపిస్తుండగా.. మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధూకర్ సరస్వతీ పుష్కరాల్లో ఎంపీకి ప్రోటోకాల్ దక్కక పోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఆయన రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ సందర్భంగా ఏర్పడ్డ ప్రోటోకాల్ చిచ్చు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రూపం దాల్చుతూ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇది రచ్చకెక్కింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాల, లక్సెట్టిపేట నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు తప్ప ఎంపీ మాత్రం తనకు ఆహ్వానం లేదంటూ పాల్గొనడం లేదు.
గత ఏప్రిల్ 14న జిల్లా కేంద్రంలో జరిగిన అంబేడ్కర్ జయంతి, జనవరి 23, 24 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్తరేషన్ కార్డుల జారీ సభల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేర్వేరుగా పాల్గొన్నారు. ఎంపీ ఈ కార్యక్రమాల్లో కనిపించలేదు. దీంతో వీరి మధ్య సమన్వయం లేనివిషయం ఈ సందర్భంగా బయటపడింది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కొద్దిరోజులుగా సాగుతున్న ప్రొటోకాల్ చిచ్చు ఆరడం లేదు. అధికారిక కార్యక్రమాలతోపాటు వివిధ సందర్భాల్లో జిల్లా యంత్రాంగంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మధ్య నెలకొన్న విభేదాలతో ఏర్పడిన ప్రొటోకాల్ చిచ్చు తో పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. సీఎం సభతో మొదలైన అంతర్గత, ఆధిపత్య కుమ్ములాటలు.. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మరోసారి రచ్చకెక్కాయి. దళిత ఎంపీ కావడంతోనే పట్టించుకోవడం లేదని ఎంపీకి మద్దతుగా దళిత సంఘాలు, యువజన సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయడం గమనార్హం.
ఏకాకిగా మారిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీగా గెలిచే వరకూ ఒక తీరు గెలిచిన తర్వాత మరో తీరుగా ఎంపీ వంశీ కృష్ణ వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వెళ్లువెత్తాయి. అసలు స్థానికంగా ఎమ్మెల్యేలను లెక్క చేయకుండానే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో స్వయంగా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని రాజకీయం చేస్తున్నాడనే విమర్శలున్నాయి. తాను వచ్చీ వెళ్లే విషయాలు తన మీడియా సంస్థలకు మినహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు ఏ మాత్రం ఉండటం లేదని వారు వాపోతున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో చెన్నూరు, బెల్లంపల్లి మినహా మిగిలిన ప్రాంతాల్లో తనకు ప్రాతినిధ్యం దక్కడం లేదని, పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి పనులకు కూడాతనను ఆహ్వా నించడం లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికి వారే అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నీతామై మ్మెల్యేలు పాల్గొంటుండగా, ఎంపీ తన అనుచరులతో కలిసి ఒక్కరే పర్యటిస్తున్నారు.
ఎమ్మెల్యేలు గ్రూప్ రాజకీయాలతో పార్టీకి నష్టం చేస్తున్నాడని గెలిచి ఏడాది దాటినా ఇప్పటివరకు పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఎంపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేదని ఎమ్మెల్యేల అనుచరులు కౌంటర్‌గా మాట్లాడుతున్నారు. మొత్తంగా నేతల మధ్య పెరుగుతున్న అంతరం వచ్చే స్థానిక సంస్థల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హస్తం శ్రేణులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ గడ్డం వంశీకి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన గడ్డం వంశీకి పార్లమెంటు పరిధిలోన ప్రోటోకాల్ లభించకపోవడం పట్ల బీఆర్ఎస్ నేత, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన సరస్వతీ పుష్కరాల్లో ఎంపీ వంశీ కృష్ణ కటౌట్, ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టకపోవడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. దళితుడైనందు వల్లే ఎంపీకి ఇంతటి అవమానం జరిగిందంటూ విమర్శలు సందించారు. ఎంపీ ప్రోటోకాల్ విషయంలో రాష్ట్రపతికి సైతం ఫిర్యాదులు చేశారు.