Mallapoor | మల్లాపూర్, జూలై 17: రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ అసోషియేషన్ అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 142 మంది విద్యార్థులు చదుతున్నారని, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్దుబాటులో భాగంగా వేరే గ్రామాలకు అధికారులు బదిలీ చేశారని అన్నారు.
తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితుల్లో వేరే గ్రామాలకు బదిలీ చేయవద్దని, లేని పక్షంలో పెద్ద ఎత్తున్న అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే ఈ విషయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడి బదిలీని నిలిపివేసినట్లు తెలిపారు.
దీనికి గాను ఎమ్మెల్యేకు గ్రామస్తులు, తల్లితండ్రులు, యూత్ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య, నాయకులు బొల్లారపు నరహరి, బషీర్, అశోక్, ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేష్, రమేష్, చిన్నశంకర్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.