కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 20 : బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ కపట బుద్ధిని గ్రామగ్రామాన ప్రచారం చేస్తామని, బీసీల సత్తా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చూపిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం బీసీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల సమక్షంలో బీసీలకు ఏడాదికి రూ.లక్ష కోట్లు, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించారని మండిపడ్డారు.
జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజా్ంయగ ప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కక పోవడంతో బీసీలకు తీరని అన్యాయం జరగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రెండేళ్లుగా కమిటీ, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. పార్టీ మీటింగ్‌ల కోసం ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి బీసీల రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకు చర్చకు తీసుకరావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా.. జనరల్ స్థానాల్లో విజయం సాధించి బీసీ సత్తా ఏంటో చూపించామన్నారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.