పెద్దపల్లి, జూన్3: పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను ఆరికట్టడంలో, వడ్ల కొనుగోళ్లలో తరుగు దోపిడీని నియంత్రించడంలో సర్కారు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయని విమర్శించారు. ఎండకాలం రాగానే మట్టి మాఫియా చెలరేగిపోతున్నది మండిపడ్డారు. రైతు ప్రభుత్వమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు.
ధాన్యం బస్తాల్లో కోతలు పెట్టిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఆ తరుగు డబ్బులను తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతాంగం తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అలాగే రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన చెరువు మట్టిని ఇటుకబట్టీల నిర్వాహకులకు అప్పగిస్తున్నారని, అధికారులు అందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని ఓవర్‌లోడ్‌తో తరలించడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని మండిపడ్డారు.
క్యూబిక్ మీటర్ల లెకన కాకుండా టిప్పర్ల లెకన అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నారని, ఒకే వేబిల్లుపై పదుల సంఖ్యలో లారీల్లో మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖాజానాకు భారీగా గండికొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేస్తున్నదని, వరి, మక్కల కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నదని ఆగ్రహించారు. నెలరోజులకు పైబడి ధాన్యం కేంద్రాల్లో ఉండడంతో వర్షాలకు తడిసిపోయిందని రైతులు కన్నీరు పెడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
కేంద్రాల్లో బస్తాకు అదనంగా రెండు కిలోల చొప్పున తూకం వేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని విమర్శించారు. అనంతరం కలెక్టరేట్లో ఏవో బండి ప్రకాశ్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, వంగాల తిరుపతిరెడ్డి, మోహన్‌రావు, సందీప్‌రావు, కొయ్యడ సతీశ్‌గౌడ్, గుణపతి, పెంచాల శ్రీధర్, వెన్నం రవీందర్, రాజ కొమురయ్య, నిదానపురం దేవయ్య, మారు లక్ష్మణ్, సలేంద్ర రాములుయాదవ్, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, బైరెడ్డి రాంరెడ్డి, బాలసాని ఈశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.