కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 30 : ‘అమ్మా.. నీ కాల్మొక్తం. రెవెన్యూ, పోలీసు అధికారుల కుట్రలకు మేం ఆగమైతున్నం. నా పిల్లలపై అన్యాయంగా తప్పుడు కేసు పెట్టిన్రు. శారీరకంగా హింసించి, జైలుకు పంపిన్రు. నా భూమిని అక్రమంగా లాక్కునే ప్రయత్నాలను నా పిల్లలు అడ్డుకుంటే, వారిని చంపుతామని పోలీసోళ్లు బెదిరిస్తన్రు. వారి నుంచి మా కుటుంబాన్ని కాపాడి, మా భూమికి రక్షణ కల్పించండి’ అంటూ ఓ వయోవృద్ధురాలు చేతులు జోడించి ‘ప్రజావాణి’లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని వేడుకున్నది. ఇప్పటికీ పదకొండు సార్లు కలెక్టర్‌ను కలిశామని, ఆరు సార్లు పోలీస్ కమిషనర్‌ను కలిశామని, అయినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయింది. తమ భూమి కబ్జా చేసేందుకు ఏనుగు జయపాల్‌రెడ్డి పోలీసులను కట్టిపెట్టుకున్నాడని, తమను మట్టుబెట్టేందుకు కూడా వెనుకాడడంటూ భయాందోళన వ్యక్తం చేసింది. దీంతో కలెక్టర్ చలించిపోయారు.
ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితురాలి మాటల్లో.. ‘ నా పేరు కాటిపల్లి లక్ష్మి. మాది జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి. నాకు ధర్మారం శివారులోని 465/బీ సర్వే నెంబర్లో 6 గుంటల భూమి ఉన్నది. ఆ భూమిని ఏనుగు జయపాల్‌రెడ్డి తప్పుడు రికార్డులతో ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు నా కొడుకు రాజు, కూతురు స్వరూప కలిసి అడ్డుకున్నరు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన్రు. అయితే జయపాల్‌రెడ్డి మాపైనే జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిండు. పోలీసులు నా పిల్లల్ని పిలిచి కొట్టి, జైలుకు పంపిన్రు. నా పిల్లలు కండిషన్ బెయిలుపై వస్తే మళ్లీ జైలుకు పంపుతామంటూ పోలీసులు బెదిరిస్తున్నరు. సదయ్య అనే కానిస్టేబుల్ ఇంటికి వచ్చి భయపెడుతున్నడు. వారి భయానికి మా ఆస్తులు వదిలి, ఊరు విడిచి పోవాలనే నిర్ణయానికి వచ్చినం’ అని కంటతడి పెట్టింది. గతంలో హుజూరాబాద్ ఆర్డీవో విచారణ జరిపినా నివేదిక ఇప్పటివరకు ఇవ్వలేదని, ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయింది. పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరింది.