కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే ప్రచారం జోరందుకున్నది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరికి వారే తమకే మొదటి ప్రాధాన్యత ఓటువేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే పలువురుప్రభుత్వోపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో పాల్గొంటున్నట్టు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ముఖ్యంగా పాఠశాలల వేళల్లో టీచర్లెవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ తాజాగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ప్రచారాలను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తుండగా.. తాజా ఆదేశాలు ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం వచ్చే యేడాది మార్చితో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగిస్తున్నది. ఇప్పటికే ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఈసీ, రెండో దఫా ఓటరు నమోదుకు ఈ నెల 9వ తేదీ వరకు అవకాశమిచ్చింది. భవిష్యత్‌లో మరోసారి నమోదుకు అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతున్నా అధికారికంగా మాత్రం స్పష్టత లేదు. కాగా, ఇప్పటివరకు విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం చూస్తే.. పట్టభద్రుల ఎమ్మెల్సీకి 3,14,531 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 23,602 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. దాదాపు 40వేలపైగా దరఖాస్తుల తిరస్కరణ తర్వాత ఈ ఓటర్లు మిగిలారు. రెండో విడుత ఓటు నమోదు రేపటితో ముగియనుండగా, శనివారం వరకు ఉన్న సమాచారం మేరకు.. గతంలో విడుదల చేసిన ముసాయిదా జాబితాకు అదనంగా గ్రాడ్యుయేట్‌కు 23వేలు, ఉపాధ్యాయులకు మరో 3 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నది. గతంతో పోలిస్తే రెండు ఎమ్మెల్సీలకు ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో పోటీచేసే ఔత్సాహిక నాయకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
ఉపాధ్యాయుల ప్రచారం!
పోటీదారులు తమ ప్రచారం కోసం ప్రభుత్వోధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. దీనికి ప్రత్యేక కారణం కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఓటరుగా నమోదు చేసుకున్న పంతుళ్లకు ఇటు పట్టభద్రులు, అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటువేసే అవకాశముంటుంది. ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకున్న పోటీదారులు.. చాలామంది టీచర్లను తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో రేటు చొప్పున ఇస్తున్నట్టు తెలుస్తుండగా, పలువురు ఉపాధ్యాయులు, సంఘనాయకులు పాఠశాల వేళల్లోనే ప్రచారానికి వెళ్తున్నారు. కొందరు బడికి ఎగనామం పెట్టి ప్రచారానికి వెళ్తుంటే.. మరికొందరు మాత్రం పోటీదారులను ఏకంగా బడికి పిలిచి, తోటి టీచర్లను పరిచయం చేస్తూ బడి వేళల్లోనే ప్రచారం చేసేలా తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా, కొంతమంది తమ తోటి పంతుళ్లను కలుపుకొని ప్రచారం చేస్తూ.. డేలోనూ దావత్‌లు పెట్టిస్తున్నారు. కొందరు టీచర్లు ప్రత్యేకంగా ఇదే పనిలో నిమగ్నమవుతున్నారనే విమర్శలు కొన్నాళ్లుగా వస్తూనే ఉన్నాయి. పలు చోట్ల ఇదే విషయమై ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తే.. సదరు హెచ్ఎంలనే ప్రచారానికి వెళ్తున్నరాని ఉపాధ్యాయులు బెదిరిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో తమకెందుకులే అన్నట్టు హెచ్ఎంలు వ్యవహరిస్తుండగా, బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీచర్లు చేస్తున్న ప్రచారంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
కఠిన చర్యలకు ఆదేశాలు
నిబంధనలకు విరుద్ధంగా, అందులోనూ స్కూల్ వేళల్లో కొంత మంది టీచర్లు చేస్తున్న ప్రచారానికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. స్కూల్ అవర్స్‌లో ఎలాంటి కాన్వాసింగ్ చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇటువంటి ప్రచారాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన సర్క్యులర్ ఆయా జిల్లాల డీఈవోల నుంచి ఎంఈవోలకు, అక్కడి నుంచి హెచ్ఎంలకు చేరింది. ప్రస్తుతం ఇది ఉపాధ్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌లా మారింది. అయినా కొంత మంది టీచర్లలో ఇంకా మార్పు రావడం లేదని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రచారాలను నిశితంగా పరిశీలించేందుకు రిటర్నింగ్ అధికారి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థలు, అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, అగ్రికల్చర్, వెటర్నటీ, నర్సింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ ఓటర్లే అయినందున ఆయా సంస్థల్లో నేరుగా ప్రచారం చేయరాదు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. పాఠశాల, కళాశాల ఆవరణల్లో ఎలాంటి ప్రచార పోస్టర్లను కూడా అంటించరాదు. అందుకు భిన్నంగా ప్రవర్తించిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునే అధికారం ఉన్నది. కాగా, ఔత్సాహిక పోటీదారుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదుల పరంపర మున్ముందు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారయంత్రాగం సైతం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.