Mandakrishna Madiga | పెద్దపల్లి టౌన్ : వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు వృద్ధులకు పెంచుతామన్న పింఛన్ రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్త సన్నాహక సదస్సును సాయి గార్డెన్లో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కాంగ్రెస్ ప్రభుత్వమిచ్చిన ఎన్నికల హామీ ఫించన్‌ను రూ.6వేలకు పెంచేంతవరకు మరో ఉద్యమం తప్పదని మందకృష్ణ హెచ్చరించారు. గతంలో తెలంగాణలోని అణగారిన వర్గాలకు చెందిన వితంతు, వృద్ధులు, వికలాంగులకు రూ.200 పింఛన్ నుంచి రూ.4016 వరకు విడదల వారిగా పెంచడం పోరాటం ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రూ.6వేలు పెంచే వరకు మహా గర్జన ఆగదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.