కాళేశ్వరం ప్రాజెక్టుపై మేధావుల్లో కదలిక వస్తున్నది. రైతుల, ప్రజలను ఏకం చేయాలనే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ‘కాళేశ్వరాన్ని కాపాడుకుందాం’ అనే అంశంపై ఆదివారం కరీంనగర్‌లోని ఫిల్మ్‌భవన్‌లో డాక్టర్ బీఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక చర్చా వేదిక జరిగింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు రైతులు, మేధావులు పాల్గొన్నారు. ప్రముఖ జల వనరుల నిపుణుడు వీ ప్రకాశ్ ముఖ్య వక్తగా హాజరవగా, ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరలేదని చెప్పిన ప్రకాశ్ తెలంగాణకు ముందు, తర్వాత పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు, మేధావులు, రైతులు ప్రాజెక్టు అవసరం గురించి వివరించారు.
– కరీంనగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ)
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం కార్డు అయ్యిందని రాహుల్‌గాంధీ కూడా విమర్శలు చేశారు. కాగ్ ఇచ్చిన నివేదికలో ఇప్పటి వరకు కాళేశ్వరంపై రూ.93 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేసింది. మరీ రాహుల్‌గాంధీ ఆరోపించినట్లు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. రాహుల్ గాంధీ, ఇతర బీజేపీ నాయకులు అన్నట్లుగా కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే మూడు బ్యారేజీలు ఎట్ల పూర్తయ్యాయి. 22 సబ్ స్టేషన్లు, 22 పంప్ హౌస్‌లు, 1,800 కిలో మీటర్ల కాలువలు, అందులో 200 కిలో మీటర్ల టన్నెళ్లు ఎలా పూర్తయ్యాయి. 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. తెలంగాణ ప్రజలు వట్టి అమాయకులు, ఏది చెప్పినా నమ్ముతారని రాహుల్ గాంధీ అనుకున్నాడేమో..
“గోదావరి, కృష్ణా నదులను ఆంధ్రా, రాయలసీమకు తరలించేందుకు అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, చివరికి వైఎస్ జగన్ కూడా ప్రయత్నించారు. కేసీఆర్ దానిని అడ్డుకున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఒక్కటే. రేవంత్‌ను పీసీసీ ప్రెసిడెంట్ చేసింది చంద్రబాబే. సమైక్యాంధ్రలో మనం పెనంపై ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు పొయ్యిలో పడిపోయాం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై మేధావులు స్పందించాలి. కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే వచ్చిన ముప్పేమిటి?. మొత్తం ప్రాజెక్టును తప్పుబడతారా..? రాజకీయాల కోసం రైతులను నాశనం చేస్తారా..? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడు, నాలుగేళ్లు నీళ్లు వచ్చినప్పుడు పంటలు ఎట్ల పండినయ్. ఒక్క గుంట పొలం ఎండిపోలేదు. మొన్నటి యాసంగిల పంటలు ఎట్ల ఎండిపోయినయి. ప్రభుత్వానికి ఇదన్నా సోయి లేకుంటే ఎట్లా?. ప్రాజెక్టును కాపాడుకుంటేనే మనకు మనుగడ ఉంటది.
– సముద్రాల రమణారావు, విత్తనోత్పత్తి సంస్థ నిర్వాహకుడు
కాళేశ్వరం ప్రాజెక్టును ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుతున్నరు. రాజకీయ పార్టీల మధ్య విబేధాల కారణంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రకృతి కూడా మారింది. వరద కాలువలో నీళ్లున్నపుడు ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు పడ్డయి. భూగర్భ జలాలు పెరిగినయి. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకుంటేనే రైతులు బతుకుతరు. రైతులను కాపాడుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవల్సిందే.
– గడ్డం భూమారెడ్డి, రైతు (కథలాపూర్)

రైతులు బాగుంటేనే అన్ని రంగాలు బాగుంటయ్. మన దేశమే వ్యవసాయ ఆధార దేశం. రైతులను బాగు చేసేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు వేయాలి. ఒక ప్రభుత్వం వేసిన ప్రణాళికలు బాగున్నప్పుడు మరో ప్రభుత్వం వాటిని కొనసాగించాలి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తే ప్రజలు ఎప్పుడు బాగుపడతరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైంది. ఈ ప్రాజెక్టును చూసేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి చూసి పోయారు. ఇలాంటి ప్రాజెక్టును కేవలం రాజకీయ స్వార్థం కోసం పనికి రాదని వదిలేస్తే ఎంత ప్రజా ధనం దుర్వియోగం అవుతుంది. ఎంత ఉత్పత్తి ఆగిపోతుంది. అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ మహేశ్ (కరీంనగర్)
స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ సర్కారును కోల్పోవడం దురుదుష్టకరం. ఒక ప్రభుత్వం చేసిన మంచి పనిని మరో ప్రభుత్వం కొనసాగించాల్సింది పోయి కక్ష సాధింపునకు పాల్పడుతున్నరు. ఇప్పటి ప్రభుత్వం కేవలం బురద జల్లుడు నేర్చుకున్నది. కాళేశ్వరాన్ని కాపాడుకుందామనే నినాదం ప్రతి గ్రామానికి వెళ్లాలి. ప్రతి రైతు ఇంటి తలుపు తట్టాలి. గతంలో మా నాన్న 9 బోర్లు వేసిండు. రెండు బోర్లు కూడా పనిచేయని పరిస్థితి. కరెంట్ వచ్చిందంటే నేనోబోరుకు, మానాన్నో బోరుకాడికి ఉరికేది. మొదటి మడి తడువక ముందే కరెంట్ పోయేది. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చినంక ఇంట్లో కూర్చుండి సెల్ ఫోన్‌తో ఆపరేట్ చేసుకుంటున్నం. మేధావులు రైతులను చైతన్యం చేయాలి. అందురూ ఒక్కటై కాళేశ్వరం ప్రాజెక్టును రక్షించుకోవాలి.
– బోయినపల్లి మధుసూదన్‌రావు, రైతు (మల్యాల)
కాళేశ్వరం నీళ్లు రాకుంటే యాసంగిల పంటలన్నీ ఎండె. మూడేండ్ల సంది కాళేశ్వరం నీళ్లు ఎట్లచ్చినయి. ఎంత మంచి పంటలు పండినయి. మా కథలాపూర్‌లో 2010ల 10 వేల క్వింటాళ్లు పండుడు మహా కష్టముండె. మొన్నటి యాసంగి తప్ప మూడు, నాలుగేండ్ల సంది పసలుకు 35 వేల క్వింటాళ్ల పంట తీసినం. ఇదంతా కేసీఆర్ కాళేశ్వరం కట్టడం వల్లనే సాధ్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునెతానికి ఎంత వరకైనా పోరాడెతందుకు రైతులు రెడీగా ఉన్నరు. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నరు. ఇలాంటి చర్చ ప్రతి మండలంల జరగాలె. రైతులకు సోయి రావాలె.
– నాగం భూమయ్య, రైతు, కథలాపూర్