కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 15 : ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని, రెండో విడుత గొర్రెల పంపిణీ ఏమైందని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధులు నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీడీలు చెల్లించిన వారికి గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. అసలు గొల్లకుర్మలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.
శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు సందెబోయిన ప్రసాద్‌యాదవ్ మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ సర్కారు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని వేడుకున్నారు. గొర్రెలు, మేకల పెంపకం ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గొల్లకుర్మలకు సంక్షేమ పథకాలన్నీ సహకార సంఘాల ద్వారా మాత్రమే అమలుచేయాలని కోరారు.
మటన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సత్వరమే స్థలం కేటాయించాలని కోరారు. ధర్నాలో కరీంనగర్ పట్టణాధ్యక్షుడు జంగ కొమురయ్య, నాయకులు గాదం శ్రీనివాస్, రాధారపు కుమార్, వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శులు ముక్కెర సదానందం, పరశురామ్ యాదవ్, జిట్ట కొమురవెళ్లి, శంకర్ యాదవ్, మర్రి ఐలయ్య, ఆసరి రాజు, భూస రాజు, సందెబోయిన స్వామి, పీరాల రవీందర్ పాల్గొన్నారు.