Sarangapur | సారంగాపూర్, మే 23: రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు. సారంగాపూర్ మండలంలోని పోతారం పంచాయతీ పరిధిలోని గణేషపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు.
సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యం చేయకుండా ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రి ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యో విధంగా చూడాలని ఆదేశించారు. హమాలీలను పెంచాలని, మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ అయ్యో విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గణేష్ పల్లి లోని మిల్లులో ధాన్యం ఆన్లోడ్ చేస్తుండడంతో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వహిదొద్దీన్, ఆర్ఐ వెంకటేష్, రైతులు, సెంటర్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.