Prize distribution | కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 5 : సున్ని మర్కజి మీలాద్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో గత ఆదివారం నిర్వహించిన సీరత్ ఇస్లామిక్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేశారు. రాజీవ్ చౌక్ లో నిర్వహించిన చివరి ఆధ్యాత్మిక సదస్సులో ముంబై నుండి వచ్చిన ప్రముఖ ఇస్లామీయ ధార్మిక పండితుడు మౌలానా సాదిక్ రజ్వి చేతుల మీదుగా అందజేశారు.
కాగా ఈ కార్యక్రమంలో సున్నీ మీలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ఆజం జ్యూవెల్లర్స్ యజమాని అబ్దుల్ కరీం జాహెద్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నగదు తో పాటు పది తులాల సిల్వర్ మెడల్స్ ను అందజేశారు. మొత్తంలో 26 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులోంచి డ్రా పద్ధతిలో విజేతలను ఎంపిక చేశారు.
మొదటి బహుమతి రూ.10వేల నగదు, 10తులాల వెండి మెడల్, రెండో బహుమతి రూ.5వేల నగదు, 10తులాల వెండి మెడల్, మూడో బహుమతి రూ.3వేల 10తులాల వెండి మెడల్, మిగతా 23మందికి సైతం 10తులాల వెండి మెడల్స్ ను అందజేశారు. అంతిమ ప్రవక్త అయినా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయడమే లక్ష్యంగా సున్నీ మర్కజీ మీలాద్ కమిటీ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
విద్యార్థుల్లో మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని చిన్నప్పటి నుంచే వివరిస్తే వారి జీవితం ఆధ్యాత్మికంగా విద్యాపరంగా అహింసా పద్ధతిలో వారి జీవితం సుఖశాంతులతో కొనసాగుతుందని, ఇహ పరలోకాలలో సాపల్యత పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవక్త జీవిత చరిత్రపై ఇస్లామిక్ టాలెంట్ టెస్ట్ నిర్వహించామని రాబోయే సంవత్సరంలో మరింత మెలకువలతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం కోసం పకడ్బందీగా పరీక్షను నిర్వహిస్తామని హాఫీజ్ యూసుఫ్ పేర్కొన్నారు.