స్వరాష్ట్రంలో దశాబ్దం పాటు శ్రమించి, విద్యారంగాన్ని సంస్కరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలల కాలంలోనే విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి, నిర్వీర్యం చేసే దుస్థితికి తీసుకువచ్చింది. వందలాది సంక్షేమ గురుకులాలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, కస్తూర్భా పాఠశాలలను ఏర్పాటు చేసి, లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన స్థితి నుంచి నేడు కనీసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో నిరుపేద పిల్లలకు పాఠాలు చెప్పించలేని దైన్యస్థితికి తీసుకొచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌లో భాగంగా పిల్లలకు విద్య, వసతిని అందించిన ప్రైవేట్ యాజమాన్యాలు దాదాపు పదహారు నెలలుగా నిధులు రాకపోవడంతో పథకం నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పగా, ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుపేద విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
జగిత్యాల, మే 30(నమస్తే తెలంగాణ) : విద్యాహక్కు చట్టం 2009ని అమలు చేయలేమని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల తేల్చి చెప్పాయి. 2009లో దేశ వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం 2009న ప్రభుత్వం ఆమోదించింది. 2009 ఆగస్టు 4న జాతీయ పార్లమెంట్ ఈ చట్టాన్ని అమలు చేసింది. విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలతో ఈ చట్టం జారీ అయింది. 6-14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ విద్య హక్కుగా ఈ చట్టం పేర్కొంది. అలాగే, పిల్లల చదువులకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన అంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది.
ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ర్టాలు 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చాయి. ఈ చట్టంలో పదో అంశంగా ప్రభుత్వ పాఠశాలలతోపాటు, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లోనూ నిరుపేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో 25 శాతం సీట్లను బడుగు, బలహీనవర్గాల వారికి రిజర్వు చేయాలని చట్టంలో పొందుపర్చారు.
చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు చట్టంలోని పదో అంశాన్ని వ్యతిరేకించాయి. తాము 25 శాతం సీట్లు కేటాయించలేమని స్పష్టం చేశాయి. ఈ విషయమై ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల మధ్య తకరారు ఏర్పడడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. చాలా సంవత్సరాల పాటు ఈ అంశంపై న్యాయస్థానాల్లో వివాదం కొనసాగింది. 25 శాతం సీట్లు, బడుగు, బలహీన, గిరిజన వర్గాల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు రిజర్వు చేయాల్సిందేనని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కేటాయించిన 25 శాతం సీట్లకు సంబంధించిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని సూచనలు చేసింది. న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ, ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య చర్చలు జరిగాయి. నిబంధనల ప్రకారం 25 శాతం సీట్లలో భర్తీ అయిన పిల్లలకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తామని విద్యా శాఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి హామీ ఇచ్చింది. అయితే, ప్రభుత్వ చెల్లింపులపై నమ్మకం లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాహక్కు చట్టం 2009ని తాము అమలు చేయలేమని, ప్రభుత్వ చెల్లింపులపై తమకు నమ్మకం లేదని పేర్కొంటూ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా తెలియజేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి ఇబ్బందికర పరిస్థితులు దాపురించాయి. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మంజూరు చేయకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చావుకు దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండేండ్లుగా రీయింబర్స్మెంట్ రావడం లేదని, కాలేజీలు నడపలేమంటూ, పరీక్షలను సైతం బాయికాట్ చేసి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.
ఇక ప్రాథమిక విద్యా రంగంలో బెస్ట్ అవలెబుల్ స్కూల్స్‌కు సైతం దాదాపు రెండేండ్లుగా నిధుల మంజూరు లేకపోవడంతో ఆ పథకం సైతం ముగిసిపోయి నిరుపేద పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడే దుస్థితి తలెత్తింది. 2014కు ముందే కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయ పథకాన్ని రూపొందించింది. నిరుపేదలైన బడుగు, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఆర్థిక సాయం అందించడం దీని ఉద్దేశం.
ఈ పథకాన్ని ఇటీవల ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఇండియా స్కీమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రతి జిల్లాలో బెస్ట్ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ పాఠశాలల్లో బడుగు, గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లను కల్పిస్తుంది. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు, బోధన, వసతికి సంబంధించిన డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుంది. షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇక గిరిజన విద్యార్థులకు సంబంధించి, 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించి ప్రాథమిక తరగతులకు సంబంధించి ప్రతి విద్యా సంవత్సరం 75 మంది విద్యార్థులకు, ప్రాథమికోన్నత తరగతులకు సంబంధించి 76 మందికి అవకాశం కల్పిస్తున్నారు. గిరిజన విభాగంలో 30 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు.
బెస్ట్ అవలెబుల్ స్కూల్స్‌లో ప్రవేశం పొందే విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సామర్థ్య పరీక్షను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి. ఎంపికైన ప్రాథమిక తరగతి విద్యార్థికి ఏడాదికి రూ.28,000లు, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు (వసతితో కలిపి) రూ.42,000లు చెల్లిస్తున్నారు. ప్రాథమికోన్నత విద్యను చదివే విద్యార్థి వసతి గృహంలో ఉండడానికి ఇష్టపడకపోతే అతడికి ఫీజుగా రూ.28 వేలు చెల్లిస్తున్నారు. గిరిజన విభాగంలోనూ ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. ప్రస్తుతం 500లకు పైగా షెడ్యూల్ కులాల విద్యార్థులు, వందకుపైగా గిరిజన విభాగ విద్యార్థులు బెస్ట్ అవలెబుల్ స్కూల్స్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే, వీరికి సంబంధించి డబ్బులను చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందిపడుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలలుగా బెస్ట్ అవలెబుల్ స్కూల్స్ స్కీమ్‌కు సంబంధించిన డబ్బులను చెల్లించలేదు. ప్రతి ఏడాది షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు కలిపి రూ.53 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, గిరిజన విభాగానికి చెందిన విద్యార్థులకు ఏటా రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దాదాపు రెండేండ్లుగా ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లింపులు జరపలేదు. ప్రస్తుతం రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు బకాయిపడింది.
పలుమార్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, జిల్లా కలెక్టరేట్‌ని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయం చుట్టూ తిరిగీతిరిగి వేసారి పోతున్నాయి. నిధుల చెల్లింపు విషయం తమ పరిధిలో లేదని, తాము ఏమీ చేయలేమని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ 16 నెలల కాలంలో రూ.లక్షకు తక్కువగా ఉన్న బిల్లులు మాత్రమే పాస్ అయ్యాయని, అంతకు మించిన బిల్లులు పాస్ కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
బెస్ట్ అవలెబుల్ స్కీమ్ కింద తమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, వసతి, భోజనం, విద్యను పొందుతున్న ప్రభుత్వాలు, తమకు నిధులను కేటాయిండానికి ససేమిరా అంటుండడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీ వ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేండ్ల క్రితం వరకు బెస్ట్అవలెబుల్ స్కూల్‌గా గుర్తింపు పొంది, ప్రభుత్వం నిర్ధేశించే పిల్లల అడ్మిషన్లు పొందేందుకు జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పోటీపడ్డాయి. ఒకానొక దశలో విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వద్ద ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పైరవీలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, నేడు పరిస్థితి మారిపోయింది.
ప్ర భుత్వం పిల్లలకు సంబంధించిన బోధన, వసతి, భోజన రుసుంలను మం జూరు చేయకపోవడంతో బెస్ట్ అవలెబుల్ స్కూల్స్ లిస్టు నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. జగిత్యాల జిల్లాలో గతంలో పది వరకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం కేవలం 3పాఠశాలలు మాత్రమే జా బితాలో ఉండడం గమనార్హం. ఆ మూడు పాఠశాలలు సైతం జగిత్యాల జి ల్లా కేంద్రానికి చెందినవి కావంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ప్రభుత్వం డబ్బుల చెల్లింపులు జరుపకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో గతంలో తమ వద్ద అడ్మిషన్ పొంది చదువుకుంటున్న విద్యార్థులను సైతం వసతిగృహాలతోపాటు, పాఠశాలల నుంచి తొలగించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం సైతం ఇచ్చినట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల చెల్లింపులో ఇబ్బందులు సృష్టించే ప్రక్రియ వల్ల నిరుపేదలైన బడుగు, గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో చదువుకుంటే ప్రభుత్వం నీళ్లు పోస్తున్నదని వాపోతున్నారు. చిన్నారుల చదువు, భోజనానికి సంబంధించిన డబ్బులను కనీసం చెల్లించలేని ఈ ప్రభుత్వం ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బెస్ట్ అవలెబుల్ స్కీమ్ డబ్బులు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని, అలాగే విద్యాహక్కు చట్టం 2009కి సంబంధించిన 25 శాతం సీట్లను సైతం కల్పించేందుకు నిధులను ముందే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.