ఇల్లందకుంట, నవంబర్ 17: అదనపు కట్నం వేధింపులకు ఏడు నెలల గర్భిణీ బలయింది. ఎస్ఐ క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లికి చెందిన మంత్రి మౌనిక (24)కు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో గతేడాది వివాహం జరిగింది. ఆ సమయంలో కట్న కానుకలు ముట్టజెప్పారు.
ప్రస్తుతం మౌనిక ఏడు నెల గర్భిణి. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త, మామ, భర్త కలిసి వేధింపులకు గురిచేస్తుండడంతో కొంత కాలంగా ఆమె తల్లి వద్దకు వచ్చి ఉంటున్నది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మౌనిక మృతికి భర్త ప్రశాంత్, అత్త సులోచన, మామ సంపత్ కారణమని ఆమె తల్లి ఉమ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.