Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 8 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వే చేయడానికి కమిషన్ పద్ధతి కాకుండా నెలకు రూ.30 వేలు వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ల రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ కు తరలి వెళ్లకుండా ముందస్తుగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల తిరుపతితో పాటు వీ రాజ్ కుమార్, కృష్ణ కాంత్ అని రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపుమేరకు తాము హైదరాబాద్ తరలి వెళ్లకుండా పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లుగా నియమించినప్పుడు ఎకరం భూమి సర్వే రూ.1,000 రేటు నిర్ణయించారని ఇప్పుడు ప్రభుత్వం అట్టి నిబంధనను మార్చడంతో తాము వెట్టిచాకిరి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం గ్రామాలలో భూముల రీ సర్వే చేస్తున్న క్రమంలో తమకు ఎకరానికి కేవలం రూ.60 మాత్రమే చెల్లిస్తూ తమను ప్రభుత్వం శ్రమదోపిడి గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము సర్వే చేసిన రెండు నెలల కాలానికి ప్రభుత్వం రూ.12,000 సొమ్ము మాత్రమే చెల్లించిందని అన్నారు. ఈ లెక్కన నెలకు రూ.6,000 సొమ్ము వచ్చినట్లు అయిందన్నారు. ఈ సొమ్మంతా తాము ప్రతిరోజు నిర్వహించే సర్వే కోసం వెళ్లిన బైకు పెట్రోల్ చార్జీలకే సరిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు నెల నెల వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.