STUTS | కోరుట్ల, జనవరి 18: విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గజేందర్ డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 5న ఆల్ ఇండియా ఉపాధ్యాయ సంయుక్త ఉద్యమ కార్యాచరణ సమితి (ఏ.ఐ.జాక్టో) ఆధ్వర్యంలో తలపెట్టిన చలో పార్లమెంట్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల పాలిట అశనిపాతం లా మారిన టెట్ పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్య ధోరణితో ఈ తీర్పు వచ్చిందని, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్ తో పీఆర్సి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు హైకోర్టు తీర్పు మేరకు, కేంద్ర ఉత్తర్వులకు అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్ రద్దు చేయాలన్నారు.
సీపీఎస్ ఉద్యోగులకు 90శాతం జీపీఎఫ్ ఏరియర్స్ 30 వాయిదాలలో చెల్లించే విధానం సరికాదన్నారు. జి.పి.ఎఫ్ వడ్డీరేటు నిర్ణయించి పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. సర్వీస్ రూల్స్ రూపొందించి వేసవి సెలవుల్లో బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని, హెల్త్ కార్డ్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లాలో ప్రమాదంలో మరణించిన ఉపాధ్యాయులకు నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, పాలేపు శివరామకృష్ణ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీర్ణంచ రవీందర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా మండల నాయకులు బండి శ్రీనివాస్, తిరుపతి చారి, అఖిల్ అహ్మద్, సాయి కుమార్, రత్నం, సురేష్ రమేష్, మహేష్, కృష్ణ, గంగాధర్, రాజశేఖర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.