Ramagundam | కోల్ సిటీ, మార్చి 26 : రామగుండం నగర పాలక సంస్థ 11వ డివిజన్ లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మించాలని ఆ డివిజన్ ప్రజా ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ లంక సురేష్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో రాంనగర్, సంజయనగర్, జ్యోతినగర్, కృష్ణానగర్, భగత్ సింగ్, ఫైవింక్లయిన్ ప్రాంతాలున్నాయనీ. ఇక్కడ అత్యధికంగా దళిత సామాజిక వర్గం వారే ఉంటారనీ, మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా శుభ కార్యాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఫంక్షన్ హాల్స్ లో నిర్వహించే స్తోమత లేక ఇరుకు రోడ్ల పైనే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
డివిజన్ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణం మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మేయర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు గడ్డం శంకర్, లక్క శ్రావణ్ గౌడ్, గడ్డం రమేష్, బుర్రి సదానందం, సిరికొండ సదానందం, బూడిద సురేశ్, అంకూస్, రాంచందర్, జాన్వెస్లీ తదితరులు పాల్గొన్నారు.