Manthani | పాలకుర్తి : మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం కన్నల బోడగుట్టపల్లిలో 12 రోజులుగా కరెంటు లేక పొలాలు ఎండుతున్న పట్టించకునే నాథుడు లేక రైతలు ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా రైతులు విద్యుత్ ఏఈకి గోడు వెళ్ళబోసుకుని వినతిపత్రం సమర్పించారు. కరెంట్ లేక వేలాది రూపాయలు ఖర్చు చేసి జనరేటర్లు వాడుతు వేసిన పంటలు కాపాడుకుంటున్నారు. అసలే వర్షాలు లేక పంటలు వాడిపోతుండగా, దీనికి తోడు ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి ఉండడంతో పంపు సెట్లు పని చేయడం లేదు.
గ్రామంలో గత 12 రోజులుగా పొలాలకు కరెంటు లేకపోవడం మూలంగా వేసిన వరి నాట్లు ఎండుతున్నాయి. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి, నూతనంగా ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేయాలని రైతులు విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికిని పట్టించుకోకపోవడంతో, 12 రోజులుగా విద్యుత్తు సరఫరా లేక వేల రూపాయలు పెట్టుబడితో వేసిన సుమారు 50 ఎకరాల్లో వరి పంట, వరి నారు ఎండిపోయే స్థితికి వచ్చింది. గ్రామంలో రైతులకు పొలాలకు కరెంటు లేకపోవడం మూలంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. మంత్రి నియోజక వర్గం అయినప్పటికీ తీవ్ర విద్యుత్తు కొరతతో వేసిన వరి పొలాలు ఎండిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి విద్యుత్ సరఫరా అయ్యేట్లు చేయించాలని విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రైతులు మల్లేశం, శంకర్, నాగేంద్ర, మధునయ్య, శ్రీశైలం, అయ్యా రాజేశం, ఆగయ్య తదితరులు విద్యుత్ అధికారులను కలిసి సమస్యను విన్నవించారు.