ఎండకాలంలో మట్టికుండలో నీళ్లు తాగితే చల్లదనానికి చల్లదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఇప్పటికీ ఎన్ని అధునాతన ఫ్రిజ్లు వచ్చినా కుండ డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే మార్కెట్లో కుండలు, రంజన్లకు భలే గిరాకీ ఉంటున్నది. కాలానుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ కాస్త తగ్గినా.. ఎండకాలం వచ్చే సరికి మాత్రం మళ్లీ ప్రాధాన్యత పెరుగుతున్నది. ఇండ్లతోపాటు చలివేంద్రాల్లో వినియోగం కోసం మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు. నల్లాలతో ఉన్న మట్టి కుండలు, రంజన్లను ఎక్కువగా కొంటున్నారు. పరిమాణాన్ని బట్టి 200 నుంచి 800 వరకు విక్రయదారులు అమ్ముతున్నారు.
వినియోగదారులను ఆకర్షించడానికి అందంగా తీర్చిదిద్దిన మట్టికుండలు, రంజన్లను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలోని నీళ్లు తాగితే ఎన్నో లాభాలున్నాయి. కుండనీటిలో సహజమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మలినాలను పీల్చుకొని నీటిని చల్లగా మార్చే అద్భుతశక్తి మట్టి కుండకు మాత్రమే ఉన్నది. ఎండలో నుంచి వచ్చి కుండలోని నీటితో ముఖం కడుక్కుంటే ఆహ్లాదంతోపాటు వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. రోగ నిరోధక శక్తి మెరుగుపడి జీవనక్రియలను పెంచుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. దగ్గు ఆస్తమా, ఇతర శ్వాస కోశవ్యాధులు ధరి చేరవు.
– మారుతీనగర్, ఏప్రిల్ 3