CRIME | వేములవాడ రూరల్ : మృతి చెందిన చిన్నారిని ఖననం చేసిన పది రోజుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప మృతదేహానికి వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని ఫాజుల్ నగర్లో బుధవారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన గండి రాజశేఖర్ గీతాంజలి దంపతులకు గత నెల 18న కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగ బిడ్డ జన్మించారు. అయితే పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు.
అయితే అక్కడ కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గంటల వ్యవధిలో చిన్నారి మృతి చెందాడని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ చిన్నారి మృతికి కరీంనగర్ లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులే కారణమంటూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే బాధితుల ఫిర్యాదు మేరకు ఈరోజు బుధవారం కరీంనగర్ లోని రెండో పట్టణ ఎస్సైలు చంద్రశేఖర్, దీపక్ కుమార్ చిన్నారిని పూడ్చిపెట్టిన ఫాజుల్ నగర్ గ్రామానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని వేములవాడ రూరల్ మండల మెజిస్ట్రేట్ అబు బాకర్ సమక్షంలో బయటకు తీసి చిన్నారి మృతదేహానికి ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రణతి రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు