కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 9 : పల్లెల్లో సౌర వెలుగుల కోసం రాష్ట్ర ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసం మహిళా సంఘాలకు 40 శాతం సబ్సిడీతో పాటు రుణసాయంతో యూనిట్లు కేటాయించనున్నది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా శాఖల అధికారులు గ్రామాల్లో అర్హులైన సంఘాలను గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు కరీంనగర్ జిల్లాలో 500 యూనిట్లు ఏర్పాటు చేయటం లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇందుకనుగుణంగా ముందుకు సాగుతున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కలిగే లబ్ధిపై గ్రామాల్లో ఇప్పటికే విస్తృ త ప్రచారం నిర్వహించారు. సౌరవిద్యుత్ వినియోగం, మిగులు విద్యుత్‌ను డిస్కంలకు సరఫరా చేయడం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలపై సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వారు తమ ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు బిగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోగా, 35 మందిని ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో నెలరోజుల్లోపు నిర్దేశించిన మేరకు యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
2 కేవీ, 3 కేవీ ప్లాంట్ల ఏర్పాటు
సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో రెండు రకాలు 2 కేవీ, 3 కేవీ యూనిట్లు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను బట్టి వారికి స్త్రీనిధి సంస్థ రుణసాయం చేయనుంది. 2 కిలో వాట్ల యూనిట్‌కు రూ.1,42,200 ధర కాగా, రూ.39,200 సబ్సిడీ అందజేస్తోంది. లబ్ధిదారు రూ.1,03,000 చెల్లించాల్సి ఉండగా, రూ.లక్ష స్త్రీనిధి ద్వారా రుణం అందిస్తుండగా, మిగతా రూ.3 వేలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 3 కిలో వాట్ల యూనిట్‌కు రూ.1,92,360 కాగా, రూ.57,360 సబ్సిడీ లభిస్తుండగా, స్త్రీనిధి సంస్థ రూ.1.25 లక్షల రుణసాయం చేస్తోంది. మిగతా రూ.10 వేలు లబ్ధిదారు చెల్లించాలి. 2 కిలోవాట్ల ప్లాంట్ ద్వారా రోజుకు 8 యూనిట్లు, 3 కిలోవాట్ ప్లాంట్‌తో 12 యూ నిట్లు విద్యుదుత్పత్తి అవుతుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు రోజుకు 5 నుంచి 6 యూనిట్లు మాత్రమే వినియోగించుకునే అవకాశముంటుంది. ఈ లెక్కన నెలకు 150 నుంచి 180 యూనిట్ల వరకు ఉపయోగపడనుండగా, మిగులు విద్యుత్ గ్రిడ్‌కు వెళ్తుంది. దీంతో, సరఫరా అయిన అదనపు విద్యుత్‌కు వినియోగదారుడికి డబ్బులు రానున్నాయి. అలాగే, ఒక్కసారి సౌర ప్లాంటు ఏర్పాటు చేస్తే ఐదేళ్ల వరకు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదన కానుంది. సోలార్ ప్లేట్లకు కూడా 25 ఏళ్ల వరకు వారంటీ ఇస్తుండగా, అత్యధిక మంది మహిళా సంఘాల సభ్యులు వీటి వినియోగం కోసం ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. తొలి విడుతగా మండలానికి 30 యూనిట్ల చొప్పున ఎంపిక చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు రూరల్, ఇటు అర్బన్ ఏరియాల్లో ఒకేసారి సభ్యులను ఎంపిక చేసి, టీఎస్ రెడ్కో సంస్థ ద్వారా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
యూనిట్ : 2 కిలోవాట్
వ్యయం : 1,42,200
సబ్సిడీ : 39,200
స్త్రీనిధి ద్వారా అందే రుణం : లక్ష
లబ్ధిదారు చెల్లించేది : 3వేలు
యూనిట్ : 3 కిలోవాట్
వ్యయం : 1,92,360
సబ్సిడీ : 57,360
స్త్రీనిధి ద్వారా అందే రుణం : 1.25లక్షలు
లబ్ధిదారు చెల్లించేది : 10వేలు
సౌర విద్యుత్తుతో అధిక లాభాలు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం మహిళా సం ఘాల కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడనుం ది. సౌర విద్యుత్ వినియోగంతో వినియోగదారులు అధిక లాభాలు గడించవచ్చు. పర్యావరణ పరిరక్షణతో పాటు మిగులు విద్యుత్ విక్రయంతో అదనపు ఆదాయం వస్తుంది. దీంతో రుణంగా తీసుకున్న మొత్తం వాయిదాల పద్ధతిలో నిర్దేశించిన గడువుకు ముందే చెల్లించే అవకాశముంటుంది. ఎలాంటి నిర్వహణ భారం కూడా వినియోగదారులకు ఉండదు. ఐదేళ్ల దాకా ప్లాంటు నిర్వహణ బాధ్యతలను యం త్రాంగమే చూసుకుంటుంది. 25 ఏళ్ల వరకు సౌర విద్యుత్ పలకలు పనిచేస్తాయి. ఇళ్ల పైనే కాకుండా, ఖాళీ స్థలంలోనూ ఈ పలకలు బిగించుకుని, విద్యుత్ ఉత్పాదన చేపట్టవచ్చు.
-ఎల్ శ్రీలత, డీఆర్డీవో