కలెక్టరేట్, జూలై 22: స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సర్కారు చొరవతో అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నారు. గతం బ్యాంకులు పరిమితంగానే రుణాలు ఇచ్చేది. కానీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అడిగిన మేరకు లోన్ ఇవ్వాలని బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో బ్యాంకర్లు రుణంతో పాటు సాంకేతిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన లావాదేవీలు నిర్వహిస్తూ ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. ఫలితంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయిని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మహిళల స్థితిగతులు, వ్యాపార వివరాలను తెలసుకొనేం దుకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ఇటీవల జిల్లాలో సర్వే చేసింది. మహిళలు తీసుకున్న రుణమొత్తం, చేస్తున్న వ్యాపారం, ఆదాయం, ఆర్ధిక పరిపుష్టి సాధించారనే అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టింది. ఇందులో జిల్లా మహిళలు తమ వ్యాపారం ద్వారా లభిస్తున్న సంపాదనతో సాధారణ, మధ్య తరగతి ఉద్యోగులను కూడా వెనక్కినెట్టిట్లు తేలింది. రుణ గ్రహీతల్లో నలభై శాతానికి పైగా మహిళలు ఖర్చులు పోనూ ఏడాదికి రూ.లక్షకు పైగా ఆర్జిస్తున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమైంది.
జిల్లావ్యాప్తంగా 13,708 స్వయం సహాయక సంఘాలుండగా, 1,48, 299 మంది మహిళలు రుణం తీసుకున్నారు. వీరిలో 1,47,206 మందిపై సర్వే చేయగా, వీరంతా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించినట్లు వెల్లడైంది. రుణం తీసుకోకముందు ఆ మహిళ ఇంటి పరిస్థితి ఎలా ఉండేది? తీసుకున్న అనంతరం ఎలా మారింది? వీరి ఆర్ధిక ఎదుగుదలలో రుణ పంపిణీకి ఆయువుపైట్టెన స్త్రీనిధి సహకారం ఎంతవరకు ఉంది అనే అంశాలపై కూడా స్పష్టంగా సర్వే చేయగా, స్వశక్తి సంఘాల్లో చేరిన అనంతరం తీసుకున్న రుణాలతోనే వారి కుటుంబాల్లో ఎదుగుదల మొదలైనట్లు తేలిందని సర్వే వర్గాలు తెలుపుతున్నాయి. మిగతా అరవై శాతం రుణగ్రహీతలను కూడా వీరితో సమానంగా వ్యాపారాల్లో రాణిస్తూ, ఆర్ధిక పరిపుష్టి సాధించేలా అవగాహన కల్పించేందుకు ఈ సర్వే వివరాలు దోహదపడుతాయని డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు.