తిమ్మాపూర్/ సిరిసిల్ల కలెక్టరేట్/ కరీంనగర్ రూరల్, ఆగస్టు 20: పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, తమ భవిష్యత్తుతో ఆటలు ఆడవద్దని విద్యార్థులు వేడుకున్నారు. పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి పాలసీని వెనకి తీసుకోవాలని, సిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని కదం తొక్కారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు తెలిపారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ రోడ్డెక్కారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వచ్చారు. అనంతరం ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడానికి కాకుండా, క్రమంగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ శక్తులకు అప్పగించే దిశగా ఉన్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్ణయంతో తాము ఉన్నత చదువులకు దూరం అవుతామని, ఉద్యోగాలూ దక్కకుండా పోతాయని వాపోయారు. పాలిటెక్నిక్ కళాశాలల మనుగడకు ముప్పుగా మారిన శక్తి (సిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనీషిమేటివ్స్) సీమ్‌ను, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరిసిల్లలో ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లారపు ప్రశాంత్, కడారి శివ, సాయిరాం, రషీద్, ముబారక్, జశ్వంత్, సాయితేజ, విజయ్, బాలాజీ, ఆదిత్య, రెహాన్, మానస, అభిజ్ఞ, సంజన, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.