తిమ్మాపూర్,మార్చి19 : మానకొండూరు నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటీవల కాలం నుండి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పలు అంశాలపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు ప్రెస్ మీట్లలో ఆరోపణల వరకే పరిమితం అయిన ఇరు పార్టీల నాయకులు.. ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వకుండా భారీ స్థాయిలో రూ.6కోట్ల పై చిలుకు స్కాం చేశారని రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను బెజ్జంకి మండలానికి బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో బుధవారం ఉదయమే కాంగ్రెస్ పార్టీ నేతలంతా బెజ్జంకి మండల కేంద్రానికి తరలుతుండగా పోలీసులు ఎక్కడికి అక్కడ కట్టడి చేశారు. బెజ్జంకి మండల కేంద్రానికి బహిరంగ చర్చకని చెప్పి బెజ్జంకి మండలం గుండారంలోని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంపై దాడి చేస్తారని ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.
తిమ్మాపూర్ మండలంలో పలువురిని ఉదయమే అదుపులోకి తీసుకున్నరు. మరి కొంతమంది తప్పించుకొని వెళ్లే పరిస్థితి ఉండడంతో రేణిగుంట టోల్గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు సైతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారని ఉద్దేశంతో పోలీసులు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే పోలీసులు భారీ స్థాయిలో నియోజకవర్గంలో సంచరించడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు చర్చించుకున్నారు. మొత్తానికైతే ఎలాంటి గొడవకు తావు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.