వైద్యుల మధ్య వార్ నడుస్తున్నది. ప్రస్తుతం అది చిలికి చిలికి గాలివానలా మారింది. అంతేకాదు, ఇప్పుడది వైద్యరంగానికి చెందిన అసోసియేషన్ పరిధి దాటి ఠాణాకు చేరడం హాట్టాఫిక్ మారింది. ఈ వివాదానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం కావడంతో వైద్య రంగంలో విస్తృత చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్లు డాక్టర్లు, దవాఖానల విషయంలో ఏమైనా విభేదాలు వస్తే.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)లేదా తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోం అసోసియేషన్ (తానా)కు ఫిర్యాదులు వెళ్లేవి. అక్కడే పరిష్కారం అయ్యేవి. కానీ, తాజాగా పలువురు వైద్యుల మధ్య సాగుతున్న వార్.. ఏకంగా జగిత్యాల జిల్లా మల్యాల ఠాణాకు వెళ్లింది. ప్రైవేట్ వ్యక్తుల జోక్యంతో అది మరింత ముదరగా, ఈ క్రమంలోనే ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం సంచలనం రేపింది.
ఈ పరిస్థితుల్లో బీఎన్‌రావు ప్రతి ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇది ఇలా ఉంటే.. బీఎన్రావుపై నమోదైన కేసు విషయాన్ని ఐఎంఏ, తానాలు ఖండించినా.. జరుగుతున్న పరిణామాలపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా..? లేక ఖండనకే పరిమితం అవుతారా..? అన్న చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఈ వివాదానికి ఆజ్యం పోసిన హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ (హెచ్ఏఎఫ్)కి పోలీసులు వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు!
కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మల్యాల : కొంతమంది నిర్వాహకులు ఎటువంటి అనుభవం లేని వైద్యులతో హాస్పిటళ్లు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇబ్బడిముబ్బడిగా బిల్లులు గుంజుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం కూడా విదితమే. నిజానికి కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లకు చెందిన వైద్యులు నిబంధనలకు లోబడి వైద్యసేవలు అందించడంతోపాటు నీతి, నిజాయితీకి కట్టుబడి రోగుల పరిస్థితులను బట్టి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ, మరికొంత మంది మాత్రం రోగిని వ్యాపార కోణంలోనే చూస్తున్నారన్న విమర్శలున్నాయి. గతంలోనూ ఇటువంటి సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. అయితే దవాఖానల్లో ఏదైనా ఘటన జరిగితే.. బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించే వారు.
కొన్నిసార్లు సదరు డాక్టర్లు, దవాఖానల నిర్వాహకులు తమ తప్పును ఒప్పుకొని, విషయం బయటకు రాకుండా ఉండేందుకు బాధితులతో ఒప్పందాలు చేసుకునే వారు. నిరాధారమైన ఆరోపణలు లేదా ఇతర సంఘటనలు జరిగినప్పుడు వైద్యులవైపు తప్పులేకపోతే.. సదరు డాక్టర్ల తరఫున ఐఎంఏ, తానా అండగా నిలిచేవి. అలాగే వైద్యుల మధ్య విభేదాలు వచ్చినా.. సదరు అసోసియేషన్లు జోక్యం చేసుకొని పరిష్కారం చేసేవి. ఇది దశాబ్దాల కాలంగా జరుగుతున్నది. కానీ, తాజాగా కరీంనగర్లో హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ (హెచ్ఏఎఫ్) పేరిట ఓ కొత్త సంఘం ఆవిర్భవించింది. ఇది వైద్య రంగంలో చిచ్చు రేగడానికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలపై జరిగే దాడుల నుంచి రక్షణ ఇచ్చే పేరిట ఓ దళాన్ని ఏర్పాటు చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇది చట్టానికి పూర్తి విరుద్ధం. నిజంగా వైద్యరంగంలో ఉన్న అసోసియేషన్లపై నమ్మకం లేకపోతే పోలీసులను ఆశ్రయించవచ్చు. కానీ, కొంతమంది స్వయంగా హెచ్ఏఎఫ్ పేరిట ఓదళాన్ని ఏర్పాటు చేసిన తీరు ప్రస్తుతం వైద్య రంగంలో వివాదాస్పదంగా మారింది.
ఠాణాకు ఫిర్యాదులు
హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ వైద్యుల మధ్య చిచ్చు రేపింది. నిజానికి ఈ దళంతో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటూ ఐఎంఏ, తానా అసోసియేషన్ల ప్రతినిధులు తాజాగా సీపీని కలిపి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు హెచ్ఏఎఫ్ ప్రతినిధులను పిలిపించి, సీపీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణగలేదని తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. హెచ్‌ఏఎఫ్‌కు అధ్యక్షుడిగా కరీంనగర్‌లోని వన్ హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ మహేశ్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇదే సమయంలో వన్ హాస్పిటల్‌పై ఇటీవల విమర్శలు వచ్చాయి. ఇదే దవాఖానలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ నుంచి కింద పడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహణ సరిగా లేదని, క్వాలిఫై డాక్టర్లు లేకుండా రన్ చేస్తున్నారని, నిబంధనలు పాటించడం లేదని మంత్రి అక్కడే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా సదరు హాస్పిటల్‌పై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ జిల్లా వైద్యాధికారిని, కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో అధికారయంత్రాంగం కదిలింది. ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ సమయంలోనే దవాఖానలో దళారీ వ్యవస్థ నడుస్తున్నదని, చిన్న సమస్యలకే అత్యంత ఖరీదైన చికిత్సలు సూచిస్తూ లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారని, పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని, అయినా సంబంధిత యాజమాన్యం స్పందించడం లేదన్న విమర్శలు వివిధ సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో వెల్లువెత్తాయి. దీని వెనుక డాక్టర్ బీఎన్‌రావు ఉన్నారని డాక్టర్ మహేశ్‌రెడ్డి భావించినట్టు ఠాణాలో చేసిన ఫిర్యాదును బట్టి అర్థం అవుతున్నది.
నిజానికి ఈ నెల 6న మల్యాల మండలం రామన్నపేట గ్రామంలోని ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు డాక్టర్ బీఎన్‌రావు వెళ్లారు. బీఎన్‌రావు సోషల్ మీడియాలో వన్ హాస్పిటల్‌పై అసత్య ప్రచారం చేస్తున్నాడని, ఐఎంఏ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాడని పేర్కొంటూ ఆ మండలానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి వర్గీయులు కొంతమంది బీఎన్ రావును ప్రశ్నించారు. ఈ సందర్భంలో తమను కులం పేరు పెట్టి దూషించారంటూ కొంత మంది వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు బీఎన్రావుపై మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే అందులో వాస్తవం లేదని పేర్కొంటూ మహేశ్రెడ్డితోపాటు అతని అనుచరులపై బీఎన్‌రావు ఈ నెల 7న ఠాణాలో ప్రతి ఫిర్యాదు చేశారు. మహేశ్వర్‌రెడ్డికి చెందిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని అదే రోజు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. బీఎన్‌రావు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం జనరల్ డైరీకి పరిమితం చేసి ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీఎన్రావుతోపాటు మహేశ్వర్‌రెడ్డి ఇద్దరు మల్యాల మండలానికి చెందిన వారే కావడం గమనార్హం.
ఐఎంఏ భవిష్యత్ కార్యాచరణ ఏమిటీ?
నిజానికి వైద్య రంగంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. ముందుగా హెచ్ఏఎఫ్ విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఐఎంఏ తోపాటు తానాకు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఐఎంఏ నిబంధనలకు లోబడి ఉండని వైద్యులపై సదరు అసోసియేషన్ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. కానీ, ఇక్కడ ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన దాఖలాలు లేవు. అయితే బీఎన్రావుపై కేసు నమోదైన విషయాన్ని ఐఎంఏ, తానా అసోసియేషన్ల ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ఈ నెల 8న ఖండించారు. ప్రస్తుతం ఈ రెండు అసోసియేషన్ల్ల ప్రతినిధులు కేవలం ఖండనకు మాత్రమే పరిమితం అవుతారా.. లేక భవిష్యత్ కార్యాచరణ ఏమైనా చేపడుతారా..? అన్న చర్చ మాత్రం ఇప్పడు వైద్య రంగంలో నడుస్తున్నది. వివాదం మొత్తం వైద్యరంగానికి సంబంధించినదే కావడంతో ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతారా.. లేక ప్రైవేట్ వ్యక్తుల జోక్యంతో కేసు నమోదైన తీరును సీరియస్‌గా తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రశ్నిస్తే కేసులు పెడుతారా..? అంటూ విలేకరుల సమావేశంలో ప్రశ్నించిన ఐఎంఏ, తానా అసోసియేషన్ నాయకుల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నదన్నది ప్రస్తుతం వైద్యరంగంలో హాట్‌టాపిక్‌గా మారింది.