Harish Rao | పెద్దపల్లి (నమస్తేతెలంగాణ) : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 సీఎస్పీలో ఉన్న బొగ్గు నిల్వలను చూసేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. సింగరేణిలో భారీగా బొగ్గు మాయం అయ్యిందనే అంశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగా ఆదివారం సాయంత్రం సి ఎస్ పీ కి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ను బొగ్గు నిల్వలను చూడకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన హరీష్ రావు బొగ్గు నిల్వలను చూసేందుకు వచ్చిన క్రమంలో పోలీసులు అక్కడికి వెళ్లకుండా భారీ బందోబస్తుతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సింగరేణి ఆర్ జీవన్ లో సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం 5 లక్షల టన్నుల బొగ్గు నిలువలు ఉండాల్సి ఉండగా 50వేలు కూడా లేదని తనకు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు చూడకుండా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.