Police overzealousness | గంగాధర, ఆగస్టు 22 : గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారన్న నేపంతో శుక్రవారం ఉదయమే పోలీసులు గర్షకుర్తి గ్రామానికి చేరుకున్నారు.
ఇంటిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తడిగొప్పుల రమేష్, మామిడిపల్లి అఖిల్ ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. తాము ఏం తప్పు చేశామని, ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించినా వారి వద్ద సమాధానం లేకపోవడంతో రమేష్, అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్శకుర్తి గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన ఉన్నందున పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు తాము ఎవరిని అడ్డుకోబోమని పోలీసులకు వివరించినా వినిపించుకోకుండా అక్రమంగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించడం దారుణమన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేవలం ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇంటి వద్ద కూరగాయలు ఇచ్చి వస్తానని చెప్పినా వినకుండా పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని బీఆర్ఎస్ నాయకుడు రమేష్ ఆరోపించారు. ఎమ్మెల్యే వస్తే పోలీసులు ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడాలని, ఇతర పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమేంటని అసంతృప్తిని వ్యక్తం చేశారు.