రాజన్న సిరిసిల్ల, జూలై 5( నమస్తే తెలంగాణ)/ మంథని/జగిత్యాల రూరల్ : కాంగ్రెస్ సర్కారు నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజల పక్షాన పోరు సాగిస్తున్న బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నది. తెలంగాణ జీవధార కాళేశ్వరంలో భాగమైన భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఉన్న నీటిని ఎత్తిపోస్తే రాష్ట్రంలోని లక్షలాది ఎకరాలకు సాగునీరందించవచ్చని, కానీ, ప్రభుత్వం నీటిని వృథా చేస్తున్న క్రమంలో పంప్‌హౌస్ సందర్శనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేటీఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా కాటారం నుంచి కన్నెపల్లికి వెళ్లారు. అయితే కేటీఆర్‌కు మద్దతుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుండగా, పోలీసులు అడుగడుగునా నిర్భంధించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ఉన్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారి వెంట పలు చోట్ల భారీగా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు కన్పిస్తే వెంటనే నిర్భందించి ఠాణాకు తరలించారు. రామగుండం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశికహరి లత, కార్పొరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా బీఆర్ఎస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో యైటింక్లయిన్ కాలనీ పట్టణంలో ధర్నా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌తోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ‘జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ’ అంటూ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. మార్గమధ్యలో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. పలువురిని పోలీస్ స్టేషన్లలో పెట్టి అడ్డుకున్నారు. తర్వాత వదిలివేశారు. జగిత్యాల జిల్లా నుంచి జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు పడిగెల గంగారెడ్డి, బుర్ర ప్రవీణ్ గౌడ్, లైశెట్టి శేఖర్, రంజిత్ తరలివెళ్తుండగా, చెన్నూర్‌లో పోలీసులు అడ్డగించారు. తర్వాత కాసేపటికి వదిలిపెట్టగా, పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.