రాంనగర్, నవంబర్ 23 : ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట పార్సిల్ వచ్చిందని, అందులో ఏటీఎం కార్డులు, డ్రగ్స్ లభ్యమయ్యాయని బెదిరించి ఓ సైబర్ నేరస్తుడు ఓ మహిళ నుంచి 21.80 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ జిల్లాకు చెందిన సదాన్షు శేఖర్ మహంతి భువనేశ్వర్‌లో వ్యాపారం చేస్తున్నట్టు చూపి పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు. తన అన్న సర్వేశ్వర్ మహంతితో కలిసి సైబర్ క్రైం నేరాలకు పాల్పడుతూ, బాధితులకు ఈ అకౌంట్ నంబర్ చెప్పి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకునేవారు.
ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీసులు రమ్మంటున్నారని బెదిరించడంతో భయపెట్టారు. దీంతో ఆమె రెండు దఫాలుగా వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో 21.80 లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత మోసపోయినట్టు గుర్తించి, వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ సెంటర్ 1930కు ఫిర్యాదు చేసింది. పిటిషన్ రాగానే కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ నర్సింహారెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారించే సమయంలో నేరస్తుడు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేసినట్టు గుర్తించారు. ఏసీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైం ఎస్ఐ వంశీకృష్ణ సిబ్బందితో కలిసి భువనేశ్వర్ జిల్లాలో తలదాచుకున్న శేఖర్ మహంతిని అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించామని, అతడి అన్న సర్వేశ్వర్ మహంతి ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడని ఏసీపీ తెలిపారు. నేరం చేయడానికి ఉపయోగించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్‌పై దాదాపు 24 కేసులు ఉన్నాయని, తెలంగాణలోని మూడు జిల్లాలతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలోనూ వీరిపై కేసులు ఉన్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. నేరస్తుడిని పట్టుకున్న సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయల్, కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ అభినందించారు.