పెద్దపల్లి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి/ పెద్దపల్లి కమాన్: ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనల నేపథ్యంలో నిర్బంధం కొనసాగుతున్నది. సీఎం ఎక్కడికి వస్తున్నా.. ఒక రోజు ముందు నుంచే ప్రశ్నించే గొంతుకలపై అణిచివేత మొదలవుతున్నది. బుధవారం సీఎం పెద్దపల్లి టూర్ సందర్భంగా నాయకుల అరెస్ట్‌ల పర్వం సాగింది. ప్రధానంగా పెద్దపల్లి జిల్లాతోపాటు జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ ప్రజావంచనకు నిరసనగా గోదావరిఖని ప్రధానచౌరస్తా టీబీజీకేఎస్ కార్యాలయ ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేశారు.
దీక్ష ప్రారంభంలోనే చందర్, నాయకులను అరెస్ట్ చేసి, మంచిర్యాల జిల్లా జైపూర్ ఠాణాకు తరలించారు. చందర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా ఎన్ని అరెస్టులు, అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రియాజ్ అహ్మద్‌ను సైతం జైపూర్ స్టేషన్‌కు తరలించారు. జూలపల్లిలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, నాయకులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. రఘువీర్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 25 వేల మంది నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.
అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, హామీలు ఇచిచ ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, పెంచాల శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దాడి సంతోష్, వెల్పుల రమేశ్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదుంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి, బసంత్‌నగర్, పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంథని నియోజకవర్గంతోపాటు జగిత్యాల జిల్లాలోనూ బీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హామీలపై ప్రశ్నిస్తే అరెస్ట్‌లా..?
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేయడం ఏంటని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మర్గాపు పాలన కొనసాగిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజావంచనకు నిరసనగా బుధవారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేయగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అరెస్టయినా భయపడేది లేదని, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.