కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 23 : బిల్లుల కోసం పాత బడికి పూతలు పెడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పథకం కింద పెద్దమొత్తంలో నిధులు మంజూరు కాగా, నాలుగేండ్ల క్రితం మూతపడిన స్కూల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. పిల్లలు లేకున్నా పనులు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇదంతా కమీషన్ల కోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట పరిధిలోని పోచంపల్లి గ్రామం నుంచి కేవలం 14 మంది విద్యార్థులే ఉన్నారు. అందులో 12 మంది ప్రైవేట్ స్కూళ్లలో చేరారు.
విద్యార్థులు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో స్థానిక ప్రాథమిక పాఠశాలను నాలుగేళ్ల క్రితం మూసివేశారు. అందులో ఉన్న ఇద్దరు పిల్లలను పక్కనే మీర్జంపేట స్కూల్లో చేర్పించారు. అయితే ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పేరిట స్కూళ్ల మరమ్మతు చేపట్టింది. అందుకు మండలంలోని 38 స్కూళ్లకు 1.70 కోట్లు మంజూరు చేసింది. అందులో పోచంపల్లి స్కూల్‌కు 6.40 లక్షలు కేటాయించింది. దీంతో మూతపడిన పోచంపల్లి పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ నిధులతో వంట గది, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. కేవలం మరుగుదొడ్లకు పైకప్పు వేయించి, సుమారు 3లక్షల పైనే నిధులు డ్రా చేశారు. ఇదే గ్రామ పరిధిలో ఉన్న కొత్తపల్లి పాఠశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు లేకపోవడంతో ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులను మీర్జంపేట పాఠశాలకు డిప్యుటేషన్ పై పంపించారు. ఈ మూతపడ్డ పాఠశాలకు 5.90లక్షలు మంజూరు కాగా, సగం వరకే పనులు పూర్తి చేశారు. అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి ఇలా మూతపడ్డ పాఠశాలలకు నిధులు మంజూరు చేయించి నామమాత్రపు పనులు చేయించి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించాలని, నిధులను దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పోచంపల్లి పాఠశాలలో మైనర్ రిపేర్ కోసం 6.40లక్షలు మంజూరయ్యాయి. వచ్చిన నిధు లతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. 3లక్షల 20వేలు డ్రా చేశాం. ఇంకా పనులు జరగాల్సి ఉంది. ఇక్కడ విద్యార్థు లు లేకపోవడంతో మూడు సంవత్సరాల క్రితం మీర్జంపేట పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపిం చారు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నా.
– కే రాజమ్మ, ఉపాధ్యాయురాలు