Model School Teachers | కాల్వ శ్రీరాంపూర్, డిసెంబర్ 03 : రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య అన్నారు. కాల్వశ్రీరాంపూర్ లో ఆయన బుధవారం మాట్లాడారు.
2013–2014 మధ్య కాలంలో నియామక ప్రక్రియలో జరిగిన ఆలస్యాల వల్ల వేతన, సీనియారిటీ విషయాల్లో ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని ఈ ఉత్తర్వులు తొలగిస్తాయని ఆయన పేర్కొన్నారు. నోషనల్ సర్వీస్‌ను అర్హతతో గణించి, తద్వారా వేతన సవరణ, తదితర ప్రయోజనాలు వర్తింపజేయడం ద్వారా ఉపాధ్యాయులకు తగిన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం కోసం నిరంతరం పోరాటం చేసిన సంఘం నాయకత్వానికి, అలాగే ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత శాఖాధికారులు అమలు ప్రక్రియను వేగవంతం చేసి, ఎటువంటి గందరగోళం లేకుండా మూలవేతన ఉత్తర్వులను ఉపాధ్యాయులకు చేరవేయాలని కోరారు. ఇకముందు కూడా ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం సంఘం అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సమన్వయంగా కృషి చేస్తామని అనుముల పోచయ్య తెలిపారు.