రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా, ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. లూటీ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరీంనగర్ పోలీసులు, పురోగతి సాధించారు. దోపిడీకి సూత్రధారులైన ఇద్దరు దొంగలను ఇప్పటికే వివిధ రాష్ర్టాల్లో పట్టుకున్నారు. ఆ ఇద్దరిని ఒకటి రెండురోజుల్లో మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం కాగా, మిగిలిన వారి కోసం కూపీ లాగుతూనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఇతర రాష్ర్టాల పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తుండగా, ఈ మొత్తం ఆపరేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కరీంనగర్ మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ధర్మపురి : కరీంనగర్‌లోని పీఎంజే జ్యవెల్లరీలో ఈ నెల 3న జరిగిన దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకే సవాల్ విసిరింది. దుండగులు ముఖాలకు మాస్కులు లేకుండా.. పట్టపగలే లూటీ చేసి ఏకంగా ఇతర రాష్ర్టాలకు పారిపోయారు. దీంతో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మేరకు సదరు ముఠా ఎక్కడ బస చేసింది? ఎలా ప్లాన్ చేసింది? అనే విషయంపై లోతుగా ఆరా తీశారు. ఆ మేరకు.. వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్స్ నుంచి డేటా సేకరించారు. చివరకు పెద్దపల్లిలోని ఓ లాడ్జిలో ఏప్రిల్‌లో మకాం వేసి, దోపిడీకి ప్లాన్ చేసినట్టు గుర్తించారు.
వారం రోజులకుపైగా ఉన్నట్టు ధ్రువీకరించుకొని, లాడ్జీతోపాటు గదిని, ఆ పరిసర ప్రాంతాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. అయితే దొంగలు ఎటువంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినా.. పోలీసులు మాత్రం మరింత లోతుగా వెళ్లి సమాచారం సేకరించారు. ఆ తర్వాత ధర్మపురి కేంద్రంగా ఉండి.. కరీంనగర్లో దోపిడీకి పాల్పడిన విషయంలోనూ పూర్తి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో దొంగల ముఠాలో కీలకమైన వ్యక్తులను గుర్తించి, వారి సమాచారం వివిధ రాష్ర్టాల నుంచి తీసుకున్నారు. బిహార్, జార్ఖండ్ రాష్ర్టాలకు చెందిన వారిగా గుర్తించి, వారిని పట్టుకునేందుకు పక్కాగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని రంగంలోకి దిగారు. ఆ మేరకు దాదాపు వివిధ రాష్ర్టాలకు 18కిపైగా బృందాలు వెళ్లాయి.
దోపిడీ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు, ఒకటీ రెండు రోజుల్లోనే దొంగలను పట్టుకుంటారని అందరూ ఆశించారు. కానీ, సదరు దొంగలు అత్యంత వ్యూహాత్మకంగా ఉమ్మడి జిల్లా దాటి ఇతర రాష్ర్టాలకు జారుకున్నారు. దీంతో ఆ దొంగలను పట్టుకోవడం పోలీసులకు ఒక సవాల్‌గా మారింది. పట్టుకోవడంలో కొంత ఆలస్యం జరిగినా.. నిజానికి పురోగతి సాధించినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తున్నది. దోపిడీలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు దొంగలను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
ముఠా సభ్యుల్లో ఈ ఇద్దరిదే ప్రధాన పాత్ర అని తెలుస్తున్నది. వీరే దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని ముందుగా పట్టుకుంటే.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకోవడం పెద్ద కష్టం కాదని భావించిన పోలీసులు.. ముందుగా ఈ ఇద్దరిపైనే దృష్టి పెట్టినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు వేర్వేరు రాష్ర్టాల్లో ఇద్దరిని పట్టుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరి నుంచి ఇతర ముఠా సభ్యుల గురించి కూపీ లాగుతున్నట్టు తెలిసింది. పట్టుకున్న ఇద్దరిని త్వరలోనే కరీంనగర్ తరలించడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
వీరి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. మిగిలిన వారిని పట్టుకోవడం కూడా రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారా.. లేదా..? అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. దొంగలను పట్టుకోవడానికి వివిధ రాష్ర్టాలకు వెళ్లిన పోలీస్ బృందాలను, అక్కడ చేయాల్సిన మ్యాప్ రూట్‌ను, ఆయా రాష్ర్టాల్లోని పోలీసుల సహకారం తీసుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ సీపీ గౌష్ ఆలం నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. మొత్తం మీద ఇద్దరు దొంగలు దొరకగా.. అతి త్వరలోనే ముఠా మొత్తం పట్టుకుంటామన్న ఆత్మ విశ్వాసాన్ని పోలీసులు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.